Tuesday, April 15, 2014

పద్య సాహిత్యం--9 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు..................

"భావ మొక్కడు గాగ,...............................
......................రంగ నిర్వహణమ్ము, రక్తి నిల్పి,

సుందరీనంద జీవితానందమట్లు........
........సృష్టిచేసితి మీ కావ్యశిల్పమూర్తి."

.....ఇది "సౌందర నందం" కావ్యం చివర్లో, కవులు తమ గురించి తాము చెప్పుకున్న పద్యం.

*         *         *
"రండు మాయింటి కీరు పేరంటమునకు...........
.....................................మా తల్లి! పౌష్యలక్ష్మి!"

.....ఇది "సంక్రాంతి" ఖండ కావ్యం లోనిది.
*        *        *
"కంకి వెడలిన ఆ లేతకారు జొన్న.......
.............................దిగకు మంచె!......"

......ఇది "జొన్న చేను" అనే ఖండిక లోని శబ్ద చిత్రం.
*        *        *
ఎఱ్ఱ సెరలనందుని చూపులు, ఇంతి.......
......................................నల్లకల్వపూల!

.....ఇది సౌందర నందం లో 'భిక్షాగమనం' ఘట్టం లోని సుందరీ నందుల ప్రేమాతిరేకాన్ని చిత్రించేది.
*        *        *
ప్రాణమా! యంచు నొండొరు పల్కరింప.........
.................'గఛ్ఛామి బుధ్ధం శరణ' మటంచు.
 
......ఇది అదే కావ్యం లో సుందరీ నందులు సన్యాసం స్వీకరించాక అలవరచుకున్న నిగ్రహానికి చిత్రణం.

ఇంక ఇవి వ్రాసిన కవులు "పింగళి కాటూరి" జంటకవులుగా ప్రసిధ్ధులైన పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వర రావు లు.

పింగళివారు 1894 లోనూ, కాటూరివారు 1895 లోనూ జన్మించారు. వీరిద్దరూ సహాధ్యాయులు. తరువాత చెళ్లపిళ్ల వేంకట శాస్త్రిగారి శిష్యులు. గళాలు వేరైనా, కలం ఒక్కటిగా ఆధునిక సాహిత్యం లో శాశ్వత పీఠం సాధించారు. భావ కవితా యుగం లో, విశ్వనాధ, రామిరెడ్డి, బాపిరాజు, కవికొండల వంటి కవుల శ్రేణి కి చెందిన వారు. 

ఆ కాలం లో, సాహిత్యం లో నడిచిన మానవోద్యమ, కాల్పనికోద్యమ, హైందవోద్యమ, స్వాతంత్ర్యోద్యమాల్లో వీరిపై యెక్కువ ప్రభావం చూపింది మానవోద్యమం. ఆ ఛాయలు 1932 లో తొలిసారి వెలువడిన వారి ప్రసిధ్ధ కావ్యం 'సౌందరనందం' లో స్పష్టంగా కనిపిస్తాయి. ఆశ్వఘోషుడు సంస్కృతం లో రచించిన అదే పేరిటి గ్రంథాన్ని, మూలం మాత్రం స్వీకరించి, చాలా స్వతంత్రతతో రచించారీకావ్యాన్ని. 

బుద్ధుడి కాలం లో ప్రణయ సామ్రాజ్యం లో మునిగి తేలుతున్న సుందరి, నందుడు అనేవాళ్ల కి శాక్యర్షి కాస్త బలవంతంగానే సన్యాసం ఇప్పించడంతో, తల్లడిల్లుతూనే, పూర్తిగా మారుతారు. ఇదీ ఇతివృత్తం. 

వీరిద్దరూ జంటగా రచించిన కృతులు "తొలకరి", "సౌందరనందం". కాటూరి వారు విడిగా "గుడిగంటలు", "పౌలస్త్యహృదయం", "మావూరు" వంటి ఖండ కృతులూ, నన్నయభట్టు నుంచి దొప్పలపూడి అనసూయాదేవి (11 వ శతాబ్ది నుంచి 20 వ శతాబ్ది) వరకూ గల కవుల కవితల్ని "తెలుగు కావ్యమాల" గా మూడు పేటలుగా 1959 లో సంకలనం చేశారు. కాటూరి వారి గుడిగంటలు హరిజనోద్యమ ప్రభావంతో వెలువడింది. 

పింగళివారు "సాహిత్య శిల్ప సమీక్ష" అనే ఉద్‌గ్రంధం రచించారు. తెలుగునుంచి సంస్కృతం నేర్చుకోడానికి "కుమార వ్యాకరణం" అనే సంస్కృత వ్యాకరణం రూపొందించారు. ఇంకా "ఆంధ్ర సాహిత్య చరిత్ర" (కృష్ణరాయ యుగం వరకూ) వ్రాశారు. 

ఇద్దరూ వెలువరించిన ఖండకృతుల్లో "సంక్రాంతి", "తొలకరి" 1915-19 మధ్య వెలువడ్డాయి.  

ముందుగా పింగళివారూ, తదుపరి కాటూరి వారూ పరమపదించారు. ఇంద్రసభలో యేమి వ్రాస్తున్నారో!



Wednesday, April 9, 2014

పద్య సాహిత్యం--9



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"భావ మొక్కడు గాగ, భావన యొక్కడై
                        రసభావ పరిణతి యెసగ జేసి,
సరసార్థ మొకడుగా, శబ్దమింకొకడయి,
                        శబ్దార్థ సామరస్యము ఘటించి,
సూత్రమొక్కడుగాగ, చిత్రణమొక్కడై,
                        ప్రాణ వత్పాత్రముల్ పాదుకొల్పి,
తెర యెత్తుటొకడుగా, తెర దించుటొక్కడై,
                        రంగ నిర్వహణమ్ము, రక్తి నిల్పి,

సుందరీనంద జీవితానందమట్లు
పరమమగు కోటికెక్కిన బంధుభావ
మిత్రభావము లిమ్మోయి మేళగించి,
సృష్టిచేసితి మీ కావ్యశిల్పమూర్తి."

*         *         *
"రండు మాయింటి కీరు పేరంటమునకు
బొమ్మలెత్తును మాపిల్ల, అమ్మలార!
ముద్దచేమంతి పూవులు ముడిచినట్టి
జడలతో, క్రొత్త వల్లెతో, అడుగులబడి
చిందులం ద్రొక్కు పరికిణీ చెలువు తోడ,
కాళ్ళ పారాణి, కాటుక కన్నుగవను
దిద్దికొని, మురి పెమ్మును ముద్దులొలక
నగు మొగమ్ముల తోడ కన్యకలు, నీకు
అర్రలొసగగ, నిలిచి రీ వరుగునపుడు
వచ్చిపోవమ్మ, మా యింటి పజ్జ కీవు!
పరమ కల్యాణి! మా తల్లి! పౌష్యలక్ష్మి!"

*        *        *
"కంకి వెడలిన ఆ లేతకారు జొన్న
చేనిపై, పిట్టలందోలు చిన్నవాడ!
దారిబోయెడు వారల పారజూచి,
విసరుమా, సుంత, వడిసెల! వెనుకనదిగొ
కంకి తినుచున్నయది గోరువంక, ఇంత
యాల సించిన నిలుచునో చాలదూర
మెగిరి పోయిన దప్పుడే! దిగకు మంచె!......"

*        *        *
ఎఱ్ఱ సెరలనందుని చూపులు, ఇంతి
ఆననేందునకు కెంపుల నివాళులెత్త,
అతివకజ్జలపుచూడ్కి, ప్రియుని
వక్షః కవాటి, కట్టుతోరణములు నల్లకల్వపూల!

*        *        *
ప్రాణమా! యంచు నొండొరు పల్కరింప
సాగి, 'ప్రా' మాత్ర పర్యవసన్నములగు
ఎలుగులు గళమ్ముతగుల, దామెట్టకేని
యనిరి 'గఛ్ఛామి బుధ్ధం శరణ' మటంచు.
 
(సమాధానాలు మరోసారి)

Friday, March 28, 2014

పద్య సాహిత్యం--8 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు..........

నీవొక యప్సరః ప్రణయినీ..................
...........................సురరాజ్య లక్ష్మికిన్‌.

విరిసినపూల వెన్నెలల వెల్లువఁ ..................
........................హృదంతర బాష్పమాధురిన్‌.

వలచి నిన్ను విసిగించినందులకు ...........
...................................సలుపుకొనుము.

........ఇవి కవి వ్రాసిన "ఓయి సుధాకరా!" అనే ఖండిక లోనివి.

*             *             *

తరతరమ్ముల ప్రేమ.....................
...........నీ యలంకారభరము........

"కోరికల నెల్లమరచి, నాకొరకు నీవు
నీ కొరకు నేను తొలి వేగుబోక రాలు
పూల జత వోలె నీ సుధా పూరమందు 
తేలిపోదము జన్మజన్మాల యాత్ర".

(ఇది ఆయన మార్కు కొట్టొచ్చినట్టు కనిపించే పద్యం. అందుకే ఇక్కడ పూర్తిగా ఇచ్చాను.)

దగ్ధ దినైక చితా......................
.........................క్షతికేల వగపు

అరణి మధించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి.  

ఇవి ఆయన యాత్ర అనే ఖండిక లోనివి.

"నీచపు దాస్య వృత్తి..............
...............సమాధి మృత్తిగన్‌".

ఇది "కాంక్ష" అనే ఖండికలో, పువ్వు కోరికని తెలిపేవి. "మఖన్‌లాల్ చతుర్వేది" హిందీలో వ్రాసిన "ఫూల్ కీ ఇచ్చా" అనే కవితకి స్వేచ్చానువాదం. ఆ హిందీ కవితని నా "సాహితీ కృష్ణ" బ్లాగులో ఇదివరకే వ్రాశాను).

ఇంక కవి పేరు వేదుల సత్యనారాయణ శాస్త్రి. దీపావళి కవిగా సుప్రసిధ్ధులు. 

భద్రాచలం తాలూకా గొల్లగూడెం గ్రామం లో 1900 మార్చ్ 22 న జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు. 1975 లో పరమపదించారు. కృష్ణశాస్త్రి కి చెప్పుకోదగ్గ వారసులు. ఆయన పంథాలోనే, ఇంకా విశిష్టంగా పురోగమించారు. వాళ్లిద్దరి కవితలకీ తేడా స్పష్టంగా తెలియడమే ఈయన విశిష్టత. 

ఈయన దీపావళి; ముక్తఝరి అనే ఖండకావ్యాలూ, అపరాధిని; ధర్మపాలుడు అనే నవలానువాదాలూ, రాణాప్రతాపసింహ; కాలేజ్ గర్ల్ నాటకాలూ వెలువరించారు. ఇంకా "జయము హిమగిరి మణికిరీటా"; "ఏమగునో ఇక నా బ్రతుకు"; "ఈ సముద్ర తటాన"; "ఓ దివ్య గాయకా, ఓ ప్రాణ గాయకా"; "కోసుకొనుము ఈ కోమల కుసుమము"; "ఈ చకోరికకు ఎన్నడూ పున్నమ" లాంటి అనేక ప్రసిద్ధ గీతాలు వ్రాశారు. 

సంస్కృతాంధ్ర ఉభయ భాషా ప్రవీణులే కాకుండా, బెంగాలీ, కన్నడ నేర్చుకున్నారు. ఠాగూర్ బాల సాహిత్యాన్ని తెలుగు చేశారు. భాస మహాకవి నాటకాలు కొన్ని అనువదించారు. అనేక కథలు వ్రాశారు. 

శతాధిక గ్రంథకర్తలైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యులు. 

వీరికి "గౌతమీ కోకిల" బిరుదు తెచ్చిపెట్టింది దీపావళి ఖండకావ్య సంపుటి. "ఇంటింట ఆనంద దిపావళీ" అంటూ సాగుతుంది. కుమారుడి అకాల మరణం తో, "మా యింట శోకాంధ తిమిరావళీ" అని ఆక్రోశిస్తారు. అందులోని "ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయాడు" అనే వాక్యం విశ్వసాహిత్యం లో చోటు చేసుకోతగ్గది అని ప్రశంసించబడింది.

"నేనే మిగిలితి నీ గౌతమీనదీ ప
విత్ర గర్భమ్ములో మ్రోత లెట్టుచున్న
యుగ యుగాంతర విశ్వమహోగ్ర దుఃఖ 
జీవగీతాల కావృత్తి చెప్పుకొనగ."

అని చెప్పుకొన్న మహానుభావుడాయన!

Tuesday, March 25, 2014

పద్య సాహిత్యం--8



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

నీవొక యప్సరః ప్రణయినీ
                    కబరీచ్యుత పారిజాత మాలా
విసరంభవో; మఱి యిలా తలమంట 
                    సుధాతుషార వర్షా విమలావ కుంఠనము 
జార్చుచు బోవు శరద్విభావరీదేవి 
                    లలాటికామణివో, దీపికవో, 
సురరాజ్య లక్ష్మికిన్‌.

విరిసినపూల వెన్నెలల వెల్లువఁ 
                    చక్కదనాల హంసవై, యరిగెడు
నిన్నుజూచు నిశలందున నాకగు  బాష్పశాంతి 
                    నీవెరుగుదు; దుఃఖతాపంబుల కిల్లగు 
ప్రాడు ప్రపంచమందెరుగరు కరుణైక
                    ముగ్దుల యగాధ హృదంతర బాష్పమాధురిన్‌.

వలచి నిన్ను విసిగించినందులకు ఫలము
ఆ మరణమేను ప్రేమ గాయకుడనగుదు;
నీవు మాత్రము పూల వెన్నలల రేల
చైత్ర నృత్యోత్సవమ్ముల సలుపుకొనుము.

*             *             *

తరతరమ్ముల ప్రేమ స్వతంత్రులరుగు
దారిఁ బోయెడు నూతనాధ్వగులమనల
పరిహసించెడు పాడు ప్రపంచమునకె
పారవేయుము నీ యలంకారభరము........

"కోరికల నెల్లమరచి, నాకొరకు నీవు
నీ కొరకు నేను తొలి వేగుబోక రాలు
పూల జత వోలె నీ సుధా పూరమందు 
తేలిపోదము జన్మజన్మాల యాత్ర".

"దగ్ధ దినైక చితా భస్మ రాశి
సుప్తివీడెడు ఉసస్సుకు పునాది
ముదిసిశిరమ్మాకు చిదిమినపట్లు
పూలకారు చివుళ్ల పురిటి పొత్తిళ్లు
గతముపై తలపేల,
క్షతికేల వగపు

అరణి మధించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి."  

"నీచపు దాస్య వృత్తి మన 
                    నేరని శూరత మాతృదేశ సే
వా చరణమ్మునందసువు 
                    లర్పణఁ జేసినవారి పార్థివ 
శ్రీ చెలువారు చోట తదసృగ్రుచులన్‌
                    వికసించి వాసనల్ 
వీచుచు రాలిపోవగవలెన్‌ 
                    తదుదాత్త సమాధి మృత్తిగన్‌".

(సమాధానాలు మరోసారి)

Monday, March 10, 2014

పద్య సాహిత్యం--7 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు...................

"నెమ్మనము తాపమడగించు........................
...............................మీద మలయు టెపుడొ."

"గోడచాటయ్యు చెలినీవు...............................
.....................................వీనుల విందు గాదొ"

"హృదయ పుస్తకమందదికింపబడిన
................................ప్రాణముల్లేచి పోవకుండ"

ఇవి "సౌభద్రుని ప్రణయయాత్ర" అనే కావ్యం లోనివి.

*             *               *

"నీవు మడిగట్టుకొని........................
...........................కన్నీటిబొట్లు రాల్తు."

"ఏను స్నానమ్మునకు..........................
.......................యన్న వాయలలు నన్ను."

ఇవి "మాతృగీతాలు" అనే ఖండకావ్యం లోనివి.

*                *               *

"తురగమ్ము నెక్కి దక్షిణ
.............................దీర్ప వచ్చెదవె కల్క్యాత్మా"

ఇది "అంజలి" ఆనే ఖండిక లోనిది.

*                *                *

"నీవు చలద్ఘనాఘన వినీల...........................................
...............................అన్నగమార్గములమ్మయమ్ముగన్‌"

ఇది "జన్మభూమి" కావ్యం లోని ఖండం "ధరణీధర" లోనిది.

ఇంక వీటి  కవి శ్రీ నాయని సుబ్బారావు.

ఆయన 1899 లో, నెల్లూరు జిల్లా పొదిలె గ్రామం లో జన్మించారు. నరసరావుపేట లో చాలాకాలం అధ్యాపక వృత్తిలో వుండేవారు. 

అప్పటి కవుల్లో కొంతమంది ఊహా ప్రేయసుల గురించి కవితలల్లితే, కొందరు కులపాలికా ప్రణయాన్ని ఆశ్రయించారు. వారిలో విశ్వనాధ వారి తరవాత, నాయని వారు ప్రసిధ్ధులు. 

కులపాలికా ప్రణయం అంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లితో భార్యగా వచ్చినావిడ. విశ్వనాధవారు పెళ్లయ్యాక నాయకుడి ప్రణయాన్ని వర్ణిస్తే, నాయని ఓ అడుగు ముందుకేసి వివాహాత్పూర్వ నేపధ్యం కూడా తీసుకున్నారు.

వారి కృతులు--సౌభద్రుని ప్రణయ యాత్ర; వేదనా వాసుదేవము; మాతృగీతాలు; జన్మభూమి అనే కావ్యాలు.

సౌభద్రుని ప్రణయ యాత్ర -- అసుర కృత్యము, శుక్రవారము, ఈప్సిత లేశము, నిద్రా సౌందర్యము, ప్రణయాహ్వానము  వంటి 45 ఖండికల కావ్యం. అభిమన్య-వత్సల (శశిరేఖ) ప్రణయం.

మాతృగీతాలు కావ్యం లో మాతృగీతాలు, సౌందర్య లహరి, తత్త్వమసి, సాగర సంగీతము, ఉత్సారణము, దాస్యగీతి, అంజలి, మహోదయము, పుష్పాంజలి అనే ఖండికలున్నాయి. తల్లి మరణం బిడ్డ మనస్సు మీద చేసే గాయం యెంతటిదో దుఃఖ నిర్భరంగా చిత్రించారిందులో.

అంజలి ఖండికలో పైన వ్రాసిన పద్యం నేతాజీ వ్యక్తిత్వ చిత్రణ. కల్కి అవతారంతో పోలిక.

జన్మభూమి కావ్యం లో ప్రకృతి ఖండం, తటాక ఖండం, ధరణీధర ఖండం, శక్తి ఖండం, శివ ఖండం అనే ఐదు ఆశ్వాసాల్లో, అనేక కథలున్నాయి. ఆయన జన్మ భూమి, బాల్య స్మృతులు, జాలిగాధలూ వినిపించారు. 

భాగ్యనగర కోకిల, విషాద మోహనము అనే రెండు ఖండ కవ్యాలు కూడా వ్రాశారు.

...............మరోసారి మరి కొన్ని.

Thursday, March 6, 2014

పద్య సాహిత్యం--7


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"నెమ్మనము తాపమడగించు కమ్మతావు 
లలముకొనుటలో తన రాక తెలియుచుండ 
నుత్తరపు గాలి చలిబాధ కోర్చి మించి 
మలయపవనమ్ము నామీద మలయు టెపుడొ."

"గోడచాటయ్యు చెలినీవు పాడు పాట 
వలపు మొలకకు అమృతంపు చెలమ యయ్యె 
తలిరుటాకుల చాటుగ దాగకేమి 
పికకుహూశ్రుతి వీనుల విందు గాదొ" 

హృదయ పుస్తకమందదికింపబడిన 
ప్రేమగీతాలపుట చింపివేయుటెట్లు?
చినుగు వెంబడి పైకెగజిమ్ము రక్త 
మున కలసి ప్రాణముల్లేచి పోవకుండ"

*             *               *

"నీవు మడిగట్టుకొని పోయినావు, పండ్లు,
పుష్పములు తీసికొని దేవపూజకెటకొ
నేను నీ కొంగు పట్టుక నీదు వెంట 
పోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు."

"ఏను స్నానమ్మునకు బావి కేగునపుడు  
లేత సూర్యుని బంగారు పూతలందు 
మురియుచును తల్లి యొడ్డును ముద్దుగొనుచు
అమ్మ యేదిరా యన్న వాయలలు నన్ను."

*                *               *

"తురగమ్ము నెక్కి దక్షిణ 
కర కమల స్ఫురిత ఖడ్గ కాంతుల దిశలన్‌
మిరు మిట్లు గొలుప, నీ వు 
త్తర కార్యము దీర్ప వచ్చెదవె కల్క్యాత్మా"

*                *                *

"నీవు చలద్ఘనాఘన వినీల మహాపఘనుండవై భవ 
ఛ్ఛ్రీ విపులోరు వక్షమున చిందులు త్రొక్కెడి నేను చంచలన్‌
కావుటదేమి అబ్బురము? క్రమ్ము మయాయిక మత్తటిత్తనూ 
వ్యావృత ధూమలుండవయి అన్నగమార్గములమ్మయమ్ముగన్‌"

(సమాధానాలు మరోసారి)

Wednesday, February 26, 2014

పద్య సాహిత్యం--6 (జవాబులు)


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు................

"ఏలా వచ్చె హవా...........................
..................................బట్టించుచున్‌ నవ్వుచున్‌"

ఈ పద్యం "ఉమర్ ఖయ్యామ్‌" నాటకం లోనిది.

"ఏలా దాచితి విన్ని..................................
........................................బాడనా కేకినై!"

ఇది "ధనుర్దాసు" నాటకం లోనిది.

"ప్రాతదారులందు......................
..............................వినుర వేమ."

"పలుచ పలుచ...........................
..............................వినుర వేమ."

ఈ రెండూ "విశ్వదాభిరామ" మకుటంతో వ్రాసిన సుమారు 300 ఆటవెలది పద్యాల్లోవి.

"...........ఏననంత శోక.................
.....................ఎవ్వరని యెంతురో నన్ను?"

ఇది చాలామందికి తెలిసినదే. కవి ప్రత్యేక ముద్ర కనిపిస్తూనే వుంది కదా. (నిజానికి పాఠకులకి క్లూ ఇవ్వడానికే దీన్ని చివర్లో వ్రాశాను. ఈ టపాల్లో నేనిస్తున్న రెండో క్లూ గురించి మరోసారి వ్రాస్తాను.)

పైవాటన్నింటి కవీ--ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఈయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపాన చంద్రంపాలెం అనే గ్రామం లో 1897 లో జన్మించారు. పంచెకట్టు, లాల్చీ, గిరిజాలు తో భావకవి కి ఓ మూర్తిని కల్పించారు. తొలి ఖండకావ్య సంపుటి కృష్ణపక్షం 1925 లో సాహితీ సమితి సభాపతి తల్లావఝల శివశంకర శాస్త్రి (తరువాత స్వామి) అచ్చువేయించారు. ప్రవాసం-ఊర్వశి అనే ఖండకావ్య సంపుటి 1929 లో వైతాళికులు సంకలన కర్త ముద్దుకృష్ణ అచ్చువేయించారు. 1975 లో ఆయన కవితా  స్వర్ణోత్సవ సందర్భంగా ఆరు సంపుటాలు వెలువడ్డాయి. 1. పల్లకీ-ఇతర పద్యాలు 2. కృష్ణపక్షకు-ప్రవాసము-ఊర్వశి, 3. మేఘమాల (సినీగీతాల సంపుటి), 4. శర్మిష్ఠ, 5. ధనుర్దాసు అనే రెండునాటికల సంపుటులు, 6. శ్రీ ఆండాళ్ తిరుప్పావు కు శాస్త్రిగారి తెలుగు కీర్తనలు, ఆండాళ్ కళ్యాణం నాటిక కలిసిన సంపుటి. ఇవి కాక వచన రచనలు 1. అప్పుడు పుట్టి వుంటే....., 2. పుష్పలావికలు, 3. బహుకాల దర్శనం (స్కెచ్ లు) వెలువడ్డాయి.

మల్లీశ్వరి యెవరూ మరువలేనిది!

Tuesday, February 25, 2014

పద్య సాహిత్యం--6


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"ఏలా వచ్చె హవా హుమాయి పయి, వా
                                           డే కుచ్చు పాగల షో
కేలా, పచ్చ జరీ బుటా మొఖమలం
                                          గీ దాల్చి చైత్రుండు కెం
గేలన్‌ సోగ గులాబి కొమ్మ కొరడా
                                          కీలించి, సారానెరా
ప్యాలా సారెకు సారెకున్‌ పెదవులన్‌
                                          బట్టించుచున్‌ నవ్వుచున్‌"

"ఏలా దాచితి విన్నినాళ్లు దయలే
                                          నే లేదటయ్యా భవ
ల్లీలా లోల విలోచనాంచల తటి
                                         ల్లేఖా చలల్లాస్యమే
నాలో కించితినా శిలా జడిమ పా
                                        యంద్రోయనా రంగదే
వా! లావణ్య పయోనిధీ? వివశన్న
                                        త్యం బాడనా కేకినై!"

"ప్రాతదారులందు ప్రథముండు కాలేక
క్రొత్తదారులందు గొప్పరాక
అడ్డుపీతనడక కధికారియయ్యెరా
విశ్వదాభిరామ, వినుర వేమ."

"పలుచ పలుచ పట్టుబట్ట కట్టెను రాజు
మరియు పలుచని బట్ట మంత్రిగట్టె
బట్ట విప్పివేసె బంట్రోతు తోచక
విశ్వదాభిరామ వినుర వేమ."

"...........ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటిసరుల దొంతరలు కలవు
నాకమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు  నిధులు కలవు!
ఎవ్వరని యెంతురో నన్ను?"

(సమాధానాలు మరోసారి)

Sunday, February 16, 2014

పద్య సాహిత్యం--5 (జవాబులు)



ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు...........

"నేను ప్రాపంచికముగ................
..................పాద నీరాజనముల!"

1920-28 మధ్య రచించబడిన "గిరికుమారుని ప్రేమగీతాలు" అనే 102 ఖండికల గుచ్చం లోనిది. తరగలెత్తే మహాసముద్రం ప్రశాంత నదిని చేరదీసి తన కష్టసుఖాలు చెప్పుకున్నట్టుంటుందీ రచన.

"నేటి యాంధ్రులు గుడ్డకుఁ.............................
.....................................లేకున్న మాడిపోదె!"

1921నాటి రచన "ఆంధ్ర పౌరుషం" లోనిది.

"తట్టలో్ గూర్చుండబెట్టిన.................................
..................................నొసటిపై నాడెనొకటి......."

ఇది "ఋతుసంహారం" ఖండకావ్యం లోనిది.

ఇక, వీటి రచయిత--రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఈయన 1895 లో కృష్ణా జిల్లా నందమూరులో పుట్టి, బందరు నోబుల్ కాలేజీలో చదివారు. సహస్ర మాసాలు జీవించి 1976 లో దివంగతులైనారు.

ఆయన వ్రాసిన నూరుకు మించిన పుస్తకాలలో, అపూర్వమైన ఖండకావ్యాలు--గిరికుమారుని ప్రేమగీతాలు; శృంగారవీధి; శశిదూతం; ఋతుసంహారం; ఆంధ్రప్రశస్తి; ఆంధ్ర పౌరుషం; విశ్వనాధ పంచశతి; కిన్నెరసాని, కోకిలమ్మ పెళ్లి గీతాలు; మాస్వామి; విశ్వనాధ మధ్యాక్కరలు; (సతీవియోగం తో వ్రాసిన) వరలక్ష్మీ త్రిశతి ముఖ్యమైనవి. 

50కి పైగా వ్రాసిన నవలల్లో ఏకవీర; చెలియలికట్ట; మ్రోయు తుమ్మెద; వేయిపడగలు; హాహాహూహూ విశేషమైనవి. 18 నాటకాలలో అనార్కలి; వేనరాజు; నర్తనశాల ప్రశస్తమైనవి.

ఈయన మధ్యాక్కరలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందారు. "ఆయన ఒక వ్యక్తి కాదు--ఒక వ్యవస్థ" అని కీర్తించారు తెలుగువారు.

Saturday, February 15, 2014

పద్య సాహిత్యం--5


ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"నేను ప్రాపంచికముగ ననేక కార్య
లగ్న హృదయుండ బోలె నెల్లరకుఁ గానఁ
బడుదునే కాని, దేవి! నా భావ మెపుడు
నిత్యలగ్నంబు నీ పాద నీరాజనముల!"

"నేటి యాంధ్రులు గుడ్డకుఁ గూటికున్న
చాలుననువారలైనారు; చచ్చిపోయె
నేమొ జాతీయ సత్వమ్ము; కోమలంబు
మల్లికకు నీరు లేకున్న మాడిపోదె!"

"తట్టలో్ గూర్చుండబెట్టిన వధువు నా
గుమ్మడి పూవులోఁ గులికెనొకటి
ఖండితాపాంగ సక్త నవాంబు కణము నా
ఘా సాగ్రమున యందు కదలెనొకటి
తులసిమ్రుగ్గుననిడ్డ తొలుకాడు దివ్వె నా
సాలీని పటముపై సాగెనొకటి
ఘూర్జరీ ముఖలంబి కొసముత్తియంబు నా
నాఁదూడ నొసటిపై నాడెనొకటి......."

(సమాధానాలు మరోసారి)

Thursday, February 6, 2014

పద్య సాహిత్యం--4 (జవాబులు)


ఒకప్పటి కవితలు


"కనుల నొండొరులను..............
...............కావలయు సఖుడ!"

"పరమధర్మార్థమైన.....................
.....................ప్రేమ యందె ముక్తి"

ఇవి "తృణకంకణం" లఘు కావ్యం లోనివి.

"పూర్వ లక్షణములు.......................
.................'అనుక్తంబు ' గ్రథనమందు"

"కుల శుభాంగీ............................
......................రుచులను వలచె నేడు"

ఇవి "రమ్యాలోకం" లోనివి.

"పదినెలలాయె బందెబడి..........................
.......................మధూదయ పర్యుషస్సులన్."

ఇది ద్విపద ఖండికలోనిది.

"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏపీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీతల్లి భూమిభారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము!"

కవి రాయప్రోలు సుబ్బారావు. ఈయన తెలుగు భావకవిత్వ యుగానికి ఆద్యుడు.

1892 లో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. 1909 లో "గోల్డ్ స్మిత్" 'హెర్మిట్' చదివి, దాన్ని అనుసరిస్తూ "లలిత" అనే లఘుకావ్యం వ్రాశారు. 1910 లో టెన్నిసన్ వ్రాసిన "డోరా" ఆధారంగా "అనుమతి" అనే మరో లఘుకావ్యం వ్రాశారు.  1912 లో ప్రచురితమైన "తృణకంకణం" తో యుగకర్త గా గుర్తింపబడ్డారు.

"అమలిన శృంగారం"; "అప్రాప్త మనోహరి" అనగానే గుర్తొచ్చేది వీరే! ఇంకా కష్ట కమల; స్నేహలతాదేవి; స్వప్నకుమారం; ఆంధ్రావళి; జెడకుచ్చులు; రమ్యాలోకం; మధుశాల (ఒమర్ ఖయ్యం రుబాయీలకు అనువాదం) వంటివి వ్రాశారు.

1913 నాటి ఆంధ్రోద్యమ ప్రభావంతో వ్రాయబడిన ద్విపద ఖండిక లోనిదే "యేదేశమేగినా........".

Tuesday, February 4, 2014

పద్య సాహిత్యం--4


ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"కనుల నొండొరులను జూచుకొనుటకన్న
మనసు లన్యోన్య రంజనల్ గొనుటకన్న
కొసరి ఏమోయి యని పిల్చుకొనుటకన్న
చెలుల కిలమీద నేమి కావలయు సఖుడ!"

"పరమధర్మార్థమైన దాంపత్య భక్తి
స్తన్యమోహనమైన వాత్సల్యరక్తి
సాక్షిమాత్ర సుందరమైన సఖ్యసక్తి
పొందు; ఆదిమ మగు ప్రేమ యందె ముక్తి"

"పూర్వ లక్షణములు దిద్దు బుధ్ధిలేదు.
అతి నవీనముల్ శాసించు నహముకాదు
నవ్య కావ్య దృష్టిని చూపినాడనంతె
కలదుగాదె 'అనుక్తంబు' గ్రథనమందు"

"కుల శుభాంగీ వయోధీర కుసుమమందు
మోహమధువె గవేషించె మున్ను సుకవి
సాత్విక ప్రేమ కోశ పేశలము లయిన
వత్స లామృత రుచులను వలచె నేడు"

"పదినెలలాయె బందెబడి
               వాకిలిమూసి, రసాలవాటికన్
మెదలక యున్న కోయిల, స
               మీరుని చక్కలిగింత గుంఫనల్
కదపగ మేలుకాంచి, కల
               కంఠముతో నవనీత గోస్తనీ
మృదుమధురంబుగా కలవ
               రించు మధూదయ పర్యుషస్సులన్."

(సమాధానాలు మరోసారి)

Thursday, January 23, 2014

పద్య సాహిత్యం--3 (జవాబులు)


ఒకప్పటి కవితలు

"విరిదండ..............
..............మరపులు దోచె."

ఇవి 1922 లో ప్రచురణ పొందిన "ఏకాంతసేవ" అనే కావ్యం లోనివి.

"చెట్టునకు మొగ్గ..............
...........................ప్రేమకొరకు."

ఖండకృతుల లోనివి.

"నీ నీడలోనుంటి.....................
................................నేనను కొందునె ప్రభు?"

ఇది 1943 లో వెలువడిన "భావ సంకీర్తనలు" లోనిది.

"కుమ్మరిసారె.................
.................నెచ్చెలులెంత పిల్చినన్."

ఇది "బృందావనం" అనే లఘుకావ్యం నుంచి, బృంద బొమ్మల పెళ్ళిళ్ళు ఎందుకు ఆడడంలేదో చెబుతుంది.

ఇంక, "వెంకట పార్వతీశ్వర కవులు" గా ప్రసిధ్ధి చెందినవారిలో బాలాంత్రపు వెంకటరావుగారు 1880 లో జన్మించారు. రెండోవారు ఓలేటి పార్వతీశం గారు 1882 లో జన్మించారు. ఇవి వారి రచనల్లోవి.

వీరు అనేక నవలలు, కావ్యాలూ వ్రాశారు. తెలుగునాట నవలలకి గొప్ప గిరాకీ ఏర్పరిచింది వీరేనట. నవలలు చాలా భాగం బెంగాలీ అనువాదాలు. స్వతంత్ర రచనల్లో, 1910 లో ప్రచురించబడిన "మాతృమందిరం", "దుర్గేశనందిని", "ప్రమదావనం", "వసుమతీవసంతం" కాక ఇంకా చాలా వున్నాయి. 

కావ్యాలు "ఏకాంతసేవ", "భావ సంకీర్తనలు", "బృందావనం", "కావ్య కుసుమావళి" మొదలైనవి. ఏకాంతసేవ ని "వంగభాషకు గీతాంజలి ఎలాంటిదో తెలుగుభాషకిది అలాంటిదని నా అభిప్రాయం" అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

నవ్యకవులమీద వీరి ప్రభావం వుంది.

(ఈ వ్యాసాలు నేను, పద్య సాహిత్యం మీది అభిమానం కొద్దీ, సేకరించి వ్రాస్తున్నవే. అసలు వీటిని వ్రాసిన రచయితల వివరాలు కూడా వ్రాస్తాను. అంతవరకూ వారికి నా క్షమాపణలు.)

Tuesday, January 21, 2014

పద్య సాహిత్యం--3



ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"విరిదండ మెడలోన వేయుటే కాని
కన్నార నీ మూర్తి గాంచనేలేదు.
ప్రణమిల్లి అడుగుల బడుటయే గాని
చేతు లారగ సేవ చేయనేలేదు."

"వెలుగు చీకటి విరిసె కాబోలు
మనసులో తెలివిలో మరపులు దోచె."

"చెట్టునకు మొగ్గతొడిగెడు చేష్టకలదు
కోరకమునకు వికసించు గుణముకలదు
విరికి వలపులు వెదజల్లు విద్యగలదు
దేనికొరకిది యంతయు దేనికొరకు?
ప్రేమకొరకు, ప్రేమకొరకు, ప్రేమకొరకు."

        ....       ....       ....      ....    

"ఈ సుఖంబును కష్టంబునెందుకొరకు
ఈ భవంబును నాశంబు నెందుకొరకు
ఈ జగంబున నిన్నియు నెందుకొరకు
ప్రేమకొరకు, ప్రేమకొరకు, ప్రేమకొరకు."

"నీ నీడలోనుంటి; నీడ నేనను కొంటి
నీడనే గాదన నేరకుంటి.
నీడజూచిన వాడ; నిను జూడకుంటిని
నీడలో నడకలు నేర్చుకొంటి.
నీడయాకృతి జూచి; నిజమనుకొంటిని
నీ నిజంబు గ్రహింప నేరనైతి.
నీడతో మాటాడి, నీ మాట మరచితి
నీడ మాటయు విననేరనైతి.
నేను నీ నీడనౌదునో కానొ, ఎరుంగ గాని
ఈ నీడ వాడను గానటంచు
నీడ నాది గాదనుచును నిశ్చయించుకొంటి
నీవాడ నేనను కొందునె ప్రభు?"

"కుమ్మరిసారె లచ్చనలు
             కుందెన కాళులు త్రొక్కుబిళ్ళలున్,
చిమ్మనగ్రోవు లోలలును
            చీకురు బండలు నాడుగాని, యే
యమ్మకు అల్లుడౌనొ తన
            యాసల కృష్ణుడటంచు బృంద, తా
బొమ్మల పెండ్లి యాటలకు
            పోవదు నెచ్చెలులెంత పిల్చినన్."

(సమాధానాలు మరోసారి)

Tuesday, January 14, 2014

పద్య సాహిత్యం



ఒకప్పటి కవితలు

మొన్నటి నా "ఒకప్పటి కవితలు" టపా కి సమాధానాలేమీ రాలేదు--బహుశా యెవరూ వూహించి వుండరేమో!

"ఉరు మహీధర................
...........వాహినిగఁ దోచె"

ఇది "మాతృగీతి" అనే ఖండిక లోది.

"నేను దుఃఖింతు..................
.......................డిండీర రుచుల"

ఇది "సముద్ర ఘోషము" లోనిది.

"సాయం ప్రస్ఫుట..........................
...............సర్తింపుమా శంకరా"

ఇది "ప్రళయ నర్తనం" ఖండిక లోది.

"అవిధరాగర్భమున......................
.......................నా అస్థిపంజరమ్ము!"

ఇది "సుప్తాస్థికలు" ఖండిక లోనిది.

ఇంక, ప్రపంచ ప్రసిధ్ధుడైన ఈ గొప్ప కవి--మహాకవి "శ్రీ శ్రీ" అనబడే "శ్రీరంగం శ్రీనివాస రావు".

ఆయన "ఇలాంటివి కూడా" వ్రాశాడా అంటారేమో......ఇలాంటివే ఇంకా చాలా వ్రాశాడు.

Sunday, January 12, 2014

ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"ఉరు మహీధర సాను నిర్ఘర నికాయ
నిర్మలాంబు ప్రవాహ నిర్ణిద్ర వృత్తి
విలసనమ్ముల, ప్రకృతిదేవి, ప్రహృష్ట
హృత్ ప్రపూర్ణానురాగ వాహినిగఁ దోచె"

"నేను దుఃఖింతు మానవాజ్ఞానమునకు
నేను హర్షింతు మానవ జ్ఞానమునకు
అఖిల మనుజ దుఃఖ ప్రమోదాశ్రుసలిల
ధారభరియింతు క్షార డిండీర రుచుల"

"సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్
                          సంపూర్ణ సౌందర్య రా
శీ యుక్తామల దివ్యమూర్తివై సా
                         క్షీ భూతనానా మరు
త్తోయస్త్రోత్ర గభీరగాన రస సం
                         తుష్టాంతరంగంబునన్
మాయా మేయ జగద్వినాశన
                         మతిన్ నర్తింపుఆ శంకరా"

"అవిధరాగర్భమున మానవాస్థికా, ప
రంపరలు--సుప్తనిశ్శబ్ద సంపుటములు
అటనొకే దీర్ఘ యామిని ఆనిశా శ్మ
శాన శయ్యకు ప్రతహ్ ప్రసక్తి లేదు--
నా కనుంగవ కన్నీళులై కరంగు
నని యొనర్చెడు నీరవాహ్వాన మెరిగి
ఇంత శోషిల్లు నేలొ, నా హృదయపుటము
వణుకు నేటికి నా అస్థిపంజరమ్ము!"

క్లూ : ఈయన ప్రపంచ ప్రసిధ్ధుడైన ఓ గొప్ప కవి.

(సమాధానాలు మరోసారి)