ఒకప్పటి కవితలు
---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.
"విరిదండ మెడలోన వేయుటే కాని
కన్నార నీ మూర్తి గాంచనేలేదు.
ప్రణమిల్లి అడుగుల బడుటయే గాని
చేతు లారగ సేవ చేయనేలేదు."
"వెలుగు చీకటి విరిసె కాబోలు
మనసులో తెలివిలో మరపులు దోచె."
"చెట్టునకు మొగ్గతొడిగెడు చేష్టకలదు
కోరకమునకు వికసించు గుణముకలదు
విరికి వలపులు వెదజల్లు విద్యగలదు
దేనికొరకిది యంతయు దేనికొరకు?
ప్రేమకొరకు, ప్రేమకొరకు, ప్రేమకొరకు."
.... .... .... ....
"ఈ సుఖంబును కష్టంబునెందుకొరకు
ఈ భవంబును నాశంబు నెందుకొరకు
ఈ జగంబున నిన్నియు నెందుకొరకు
ప్రేమకొరకు, ప్రేమకొరకు, ప్రేమకొరకు."
"నీ నీడలోనుంటి; నీడ నేనను కొంటి
నీడనే గాదన నేరకుంటి.
నీడజూచిన వాడ; నిను జూడకుంటిని
నీడలో నడకలు నేర్చుకొంటి.
నీడయాకృతి జూచి; నిజమనుకొంటిని
నీ నిజంబు గ్రహింప నేరనైతి.
నీడతో మాటాడి, నీ మాట మరచితి
నీడ మాటయు విననేరనైతి.
నేను నీ నీడనౌదునో కానొ, ఎరుంగ గాని
ఈ నీడ వాడను గానటంచు
నీడ నాది గాదనుచును నిశ్చయించుకొంటి
నీవాడ నేనను కొందునె ప్రభు?"
"కుమ్మరిసారె లచ్చనలు
కుందెన కాళులు త్రొక్కుబిళ్ళలున్,
చిమ్మనగ్రోవు లోలలును
చీకురు బండలు నాడుగాని, యే
యమ్మకు అల్లుడౌనొ తన
యాసల కృష్ణుడటంచు బృంద, తా
బొమ్మల పెండ్లి యాటలకు
పోవదు నెచ్చెలులెంత పిల్చినన్."
(సమాధానాలు మరోసారి)
No comments:
Post a Comment