Sunday, November 9, 2008

రా……….నేస్తం!

నీకూ నాకూ మధ్య……...

అక్షరాల ఇటుకలతో వంతెన నిర్మించాను.
అనురాగపు మెట్లతో నిచ్చెన వేశాను.

ఉషస్సులో, తమస్సులో…..
ఊహల పల్లకీలో ప్రయాణిస్తూ…..
నిన్నెలా చేరుకోను?

అందుకే—భావాల బంధాలకు బంగారు రంగు పులిమి
అరుణ కిరణాలతో సందేశం పంపాను.
అందిందా నేస్తం అది నీకు?

మరి ఇంకా ఆలస్యం యెందుకు?

మెఱుపుకంటే ముందుగా,
చిరుగాలి తరగలా పయనిస్తూ,
సెలయేటి అలలా పులకిస్తూ,
విరజాజి విరిలా పల్లవిస్తూ…..
నన్ను చేరుకో నేస్తం!

రా! రా……….నేస్తం ……….నాకోసం!


……..శ్రీ

(ఆంధ్ర భూమిలో, “కోయిలా! కో…యిలా!”శీర్షిక క్రింద ప్రచురింపబడింది)

Friday, October 31, 2008

హైకూలు

ఈ మధ్య చాలామంది పత్రికల్లో హైకూల పేరుతో తమ కవితల్ని ప్రచురిస్తున్నారు.

కాని, అసలు హైకూలు అనేవి జపనీస్ భాషలో కవితలు.

వాటి స్వారస్యం ఎక్కడంటే, ఇవి 3 పాదాల్లొ వుంటాయి.

కాని.....

ఆఖరు పాదం తీసేస్తే, మొదటి రెండు పాదాలకీ అసలు సంబంధం వుండదు!

నా ఉదాహారణ హైకూలు:-

1) 'అనంతాకాశం!

కల్లోల కడలి!

నడుమ----నిండు జాబిల్లి!'

2) 'ఆకాశం క్రింద మబ్బులు!

అనంతానంద హేల!

మయూరి నాట్య లీల!'

-------ఇలాంటివి. ట్రై చెయ్యండి!

Monday, October 20, 2008

మిగిలిపో!

నా అంతరంగాన్ని నీ మనో నేత్రంతో చూడు!
ఏ చిత్రకారుడి ఊహకీ అందని
అపురూప సౌందర్యాలు కనిపిస్తాయి.

నా ఎదసొదలని ఒక్కసారి విను!
ఏ గాయకుడి గళానికీ అందని
అనూహ్య రాగాలు వినిపిస్తాయి.

నా మనసు పుస్తకాన్ని ఒక్కసారి చదువు!
ఏ కవి కలానికీ అందని
అవ్యక్త భావాలు తెలుస్తాయి.

నువ్వు.....

చిత్రకారుడివై ఏ సౌందర్యాన్నీ చిత్రించక్కర్లేదు......
గాయకుడివై ఏ రాగాన్నీ గానం చెయ్యక్కర్లేదు ......
కవివై ఏ భావాన్నీ వర్ణించక్కర్లేదు......

నన్ను నన్నుగా ప్రేమించే
ఒక మంచి స్నేహితుడిగా.....మిగిలిపో! చాలు.

......శ్రీ
.........చాలు!


విశ్వమంత చోటేల?

నీ మదిలో.....గుప్పెడంత స్థలం చాలు!

సూర్యుడంత కాంతులేల?

నీ కనులలో.....మెరిసే గోరంత మెఱుపులే చాలు!

వెన్నెలంత చల్లదనమేల?

నీ చిరునవ్వుల .....తియ్యందనాలు చాలు!

మల్లెలంత పరిమళాలేల?

నీ మాటల.....సౌరభాల గుబాళింపులే చాలు!

సముద్రమంత అమృతమేల?

నీకు నాపై.....ఉన్న ప్రేమ చాలు!


.....శ్రీ

Sunday, July 20, 2008

నిశ్శబ్ద రాగాలు


తిమిర స్రవంతిలో నక్షత్రాల నీటిబిందువులు మెరుస్తుంటే
కొండల మండువాలో ఎక్కడో ఆకాశం భూమిని ముద్దాడుతుంటే

అది చూసి చెట్ల ఆకులు సిగ్గుతో ముడుచుకుపోతుంటే
అంతటానిశ్శబ్దం ఆవరించి ఉంటే..........

స్వప్న లోకాల్లొ విహరిస్తున్న నాకు
జాబిల్లి చల్లని వెన్నెల జలాలు చల్లి నిశ్శబ్దం గా మేలుకొలుపు పాడింది.

అప్పుడే తెలిసింది నాకు....నిశ్శబ్దంలో రాగాలు పలుకుతాయని!
నిశ్శబ్దం ఎంత మధురమైనది!

ఒంటరితనపు ఊయలలో ఓలలాడుతూ
తీయని నిశ్శబ్దపు మాధుర్యాన్ని అనుభవించేవేళలో
చప్పుడుచేస్తే నాగుండెనైనా క్షమించలేను!

-----శ్రీ

Friday, June 13, 2008

కృతజ్ఞత




.........."వర్షం వెళ్ళిపోయింది.....మబ్బుల రథాలెక్కి!

జలదానం చేసిన మేఘాలకి జోహార్లు చెప్పాయి చరాచరాలు!

భూమిలో ఉన్న చిన్నారి గింజ మెడ బయటపెట్టి

మొదటవచ్చిన రెండాకుల్ని చేతులుగా జోడించింది....కృతజ్ఞతతో.........."

----------శేషేంద్ర (గుంటూరు శేషేంద్ర శర్మ)


..........నేనుతప్ప!



నిరంతరం నాకోసం ఎవ్వరూ ఏడవరు..........

..........నాకళ్ళుతప్ప!

నిరంతరం నాకోసం నాతో ఎవ్వరూ నడవరు..........

..........నా అడుగులు తప్ప!

నిరంతరం నాకోసం నాతో ఎవ్వరూ మాట్లాడరు..........

..........నిశ్శబ్దం తప్ప!

నిరంతరం నాకోసం నాకు తోడుగా ఎవ్వరూ నిలవరు..........

..........నా ఒంటరితనం తప్ప!

నిరంతరం నన్ను నన్నుగా ఎవ్వరూ గుర్తించరు..........

..........నా అంతరాత్మ తప్ప!

నిరంతరం నాకోసం నన్ను నన్నుగా ఎవ్వరూ ప్రేమించరు..........
..........నా మనస్సు తప్ప!

..........అందుకే ఇంట్రావర్ట్ నయిన నా లోకంలో

నాకంటూ ఎవ్వరూ ఉండరు--నేను తప్ప!

----------శ్రీ

Thursday, June 12, 2008

నా హృదయం

నా హృదయం ఒక సులలిత సుమం..........
..........ముట్టుకుంటే ముకుళించుకు పోతుంది!

నా హృదయం ఒక మంచు పర్వతం..........
..........కనుచూపుకే కరిగిపోతుంది!

నా హృదయం ఒక కారుణ్య మేఘం..........
..........కోరితే ప్రేమ జల్లులు కురిపిస్తుంది!

నా హృదయం ఒక ప్రేమ సముద్రం..........
..........ఆత్మీయతకోసం ఆరాటపడే ఆర్తిని తీరుస్తుంది!

నా హృదయం ఒక అమృత కలశం..........
..........అణువణువునా ఆనందసుధని అందిస్తుంది!

నా హృదయం ఒక అందమైన అద్దం!.....
..........కించిత్ బాధ కలిగినా, తునాతునకలైపొతుంది......!!!!!

.....................శ్రీ

Wednesday, June 11, 2008

"ఇంట్రావర్ట్ నైన నేను..............
చెప్పాలనుకుంటే 'కలాన్నీ'........
వినాలనుకుంటే 'పుస్తకాన్నీ'
ఆశ్రయిస్తాను..........."
------------శ్రీ
నా కవితలు

'ఎక్కడో దిగంతాల చివరన భూమ్యాకాశాలు కలిసే చొట, ఆనందాన్నీ, విషాదాన్నీ విడదీసే సన్నని రేఖమీద నిలబడి పాడుకుంటూ ఉంటాను....యెవ్వరూ వినని పాటని!
సుఖాంతమూ, దుహ్ఖాంతమూ కాని ఒక వేదాంతాన్ని మననం చేసుకుంటూ సాగిపోతూ వుంటాను............ఎవ్వరూ నడవని బాటని!
ఎప్పుడో నవ్వే పువ్వులనీ, ఎగిరే గువ్వలనీ చూసి, నామది రెండు కన్నీటి చుక్కలు రాలిస్తే..............అవి అక్షర ముత్యాలుగా నా కలం నుంచి జాలువారుతాయి!
అనుభూతుల తెమ్మెరల తాకిడికి, నా హృదయం లోంచి భావాల పుష్పాలు రాలి, అక్షరాలలో అందంగా ఒదిగిపోతాయి!
అక్షరాల ముత్యాలనీ, భావాల పుష్పాలనీఅందంగా అల్లితే.......కవితల ముత్యాల సరాలు ఆవిర్భవిస్తాయి!'
--------------శ్రీ

Thursday, June 5, 2008

చదువరులకి------

"శ్రీ" అనే కలంపేరు పెట్టుకొన్న, ఒక పాప, తనకి ఇరవై యేళ్ళు వచ్చే లోపల తన లేలేత భావనల్ని 'కవితాత్మకంగా' ఆవిష్కరించిన "ఒక మౌనం పలికింది" అనే అముద్రిత ఖండకావ్య గుఛ్ఛం నుంచి.........కొన్ని!......అప్పుడప్పుడూ......!
ఇవి కాక ప్రసిద్ధ కవుల, రచయితల కవితలూ, రచనలూ కూడా.........! (సాధారణంగా యెవరూ చదివి/విని వుండనివి!)

మరి ఆనందించండి!

మీ స్పందన తెలియ చేస్తే..........సంతొషం!
మరి ఆలస్యం యెందుకు?
'మనసు మూగదైపొతే మౌనమే మాట్లాడుతుంది.
అనుభూతుల తాకిడికి మూగవోయిన నా మనస్సులోంచి----
"ఒక మౌనం పలికింది!"
-------శ్రీ
నా కవితలు
నా కవితలు కూసే కోయిల కువకువలలో
వినిపించే ఆర్ ద్రగీతాలు...
నా కవితలు పిల్లగాలుల పిల్లనగ్రొవిలు మోసుకొచ్చే
ప్రేమసందేశాలు...
నా కవితలు చిన్నారి పాపాయిల బోసినవ్వులు
కురిపించే అమృతంపు వానలు.....!
------శ్రీ