Wednesday, February 26, 2014

పద్య సాహిత్యం--6 (జవాబులు)


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు................

"ఏలా వచ్చె హవా...........................
..................................బట్టించుచున్‌ నవ్వుచున్‌"

ఈ పద్యం "ఉమర్ ఖయ్యామ్‌" నాటకం లోనిది.

"ఏలా దాచితి విన్ని..................................
........................................బాడనా కేకినై!"

ఇది "ధనుర్దాసు" నాటకం లోనిది.

"ప్రాతదారులందు......................
..............................వినుర వేమ."

"పలుచ పలుచ...........................
..............................వినుర వేమ."

ఈ రెండూ "విశ్వదాభిరామ" మకుటంతో వ్రాసిన సుమారు 300 ఆటవెలది పద్యాల్లోవి.

"...........ఏననంత శోక.................
.....................ఎవ్వరని యెంతురో నన్ను?"

ఇది చాలామందికి తెలిసినదే. కవి ప్రత్యేక ముద్ర కనిపిస్తూనే వుంది కదా. (నిజానికి పాఠకులకి క్లూ ఇవ్వడానికే దీన్ని చివర్లో వ్రాశాను. ఈ టపాల్లో నేనిస్తున్న రెండో క్లూ గురించి మరోసారి వ్రాస్తాను.)

పైవాటన్నింటి కవీ--ప్రఖ్యాత భావకవి దేవులపల్లి కృష్ణశాస్త్రి.

ఈయన తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపాన చంద్రంపాలెం అనే గ్రామం లో 1897 లో జన్మించారు. పంచెకట్టు, లాల్చీ, గిరిజాలు తో భావకవి కి ఓ మూర్తిని కల్పించారు. తొలి ఖండకావ్య సంపుటి కృష్ణపక్షం 1925 లో సాహితీ సమితి సభాపతి తల్లావఝల శివశంకర శాస్త్రి (తరువాత స్వామి) అచ్చువేయించారు. ప్రవాసం-ఊర్వశి అనే ఖండకావ్య సంపుటి 1929 లో వైతాళికులు సంకలన కర్త ముద్దుకృష్ణ అచ్చువేయించారు. 1975 లో ఆయన కవితా  స్వర్ణోత్సవ సందర్భంగా ఆరు సంపుటాలు వెలువడ్డాయి. 1. పల్లకీ-ఇతర పద్యాలు 2. కృష్ణపక్షకు-ప్రవాసము-ఊర్వశి, 3. మేఘమాల (సినీగీతాల సంపుటి), 4. శర్మిష్ఠ, 5. ధనుర్దాసు అనే రెండునాటికల సంపుటులు, 6. శ్రీ ఆండాళ్ తిరుప్పావు కు శాస్త్రిగారి తెలుగు కీర్తనలు, ఆండాళ్ కళ్యాణం నాటిక కలిసిన సంపుటి. ఇవి కాక వచన రచనలు 1. అప్పుడు పుట్టి వుంటే....., 2. పుష్పలావికలు, 3. బహుకాల దర్శనం (స్కెచ్ లు) వెలువడ్డాయి.

మల్లీశ్వరి యెవరూ మరువలేనిది!

Tuesday, February 25, 2014

పద్య సాహిత్యం--6


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"ఏలా వచ్చె హవా హుమాయి పయి, వా
                                           డే కుచ్చు పాగల షో
కేలా, పచ్చ జరీ బుటా మొఖమలం
                                          గీ దాల్చి చైత్రుండు కెం
గేలన్‌ సోగ గులాబి కొమ్మ కొరడా
                                          కీలించి, సారానెరా
ప్యాలా సారెకు సారెకున్‌ పెదవులన్‌
                                          బట్టించుచున్‌ నవ్వుచున్‌"

"ఏలా దాచితి విన్నినాళ్లు దయలే
                                          నే లేదటయ్యా భవ
ల్లీలా లోల విలోచనాంచల తటి
                                         ల్లేఖా చలల్లాస్యమే
నాలో కించితినా శిలా జడిమ పా
                                        యంద్రోయనా రంగదే
వా! లావణ్య పయోనిధీ? వివశన్న
                                        త్యం బాడనా కేకినై!"

"ప్రాతదారులందు ప్రథముండు కాలేక
క్రొత్తదారులందు గొప్పరాక
అడ్డుపీతనడక కధికారియయ్యెరా
విశ్వదాభిరామ, వినుర వేమ."

"పలుచ పలుచ పట్టుబట్ట కట్టెను రాజు
మరియు పలుచని బట్ట మంత్రిగట్టె
బట్ట విప్పివేసె బంట్రోతు తోచక
విశ్వదాభిరామ వినుర వేమ."

"...........ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటిసరుల దొంతరలు కలవు
నాకమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు  నిధులు కలవు!
ఎవ్వరని యెంతురో నన్ను?"

(సమాధానాలు మరోసారి)

Sunday, February 16, 2014

పద్య సాహిత్యం--5 (జవాబులు)



ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు...........

"నేను ప్రాపంచికముగ................
..................పాద నీరాజనముల!"

1920-28 మధ్య రచించబడిన "గిరికుమారుని ప్రేమగీతాలు" అనే 102 ఖండికల గుచ్చం లోనిది. తరగలెత్తే మహాసముద్రం ప్రశాంత నదిని చేరదీసి తన కష్టసుఖాలు చెప్పుకున్నట్టుంటుందీ రచన.

"నేటి యాంధ్రులు గుడ్డకుఁ.............................
.....................................లేకున్న మాడిపోదె!"

1921నాటి రచన "ఆంధ్ర పౌరుషం" లోనిది.

"తట్టలో్ గూర్చుండబెట్టిన.................................
..................................నొసటిపై నాడెనొకటి......."

ఇది "ఋతుసంహారం" ఖండకావ్యం లోనిది.

ఇక, వీటి రచయిత--రామాయణ కల్పవృక్షం, వేయిపడగలు వ్రాసిన శ్రీ విశ్వనాథ సత్యనారాయణ.

ఈయన 1895 లో కృష్ణా జిల్లా నందమూరులో పుట్టి, బందరు నోబుల్ కాలేజీలో చదివారు. సహస్ర మాసాలు జీవించి 1976 లో దివంగతులైనారు.

ఆయన వ్రాసిన నూరుకు మించిన పుస్తకాలలో, అపూర్వమైన ఖండకావ్యాలు--గిరికుమారుని ప్రేమగీతాలు; శృంగారవీధి; శశిదూతం; ఋతుసంహారం; ఆంధ్రప్రశస్తి; ఆంధ్ర పౌరుషం; విశ్వనాధ పంచశతి; కిన్నెరసాని, కోకిలమ్మ పెళ్లి గీతాలు; మాస్వామి; విశ్వనాధ మధ్యాక్కరలు; (సతీవియోగం తో వ్రాసిన) వరలక్ష్మీ త్రిశతి ముఖ్యమైనవి. 

50కి పైగా వ్రాసిన నవలల్లో ఏకవీర; చెలియలికట్ట; మ్రోయు తుమ్మెద; వేయిపడగలు; హాహాహూహూ విశేషమైనవి. 18 నాటకాలలో అనార్కలి; వేనరాజు; నర్తనశాల ప్రశస్తమైనవి.

ఈయన మధ్యాక్కరలు గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి పొందారు. "ఆయన ఒక వ్యక్తి కాదు--ఒక వ్యవస్థ" అని కీర్తించారు తెలుగువారు.

Saturday, February 15, 2014

పద్య సాహిత్యం--5


ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"నేను ప్రాపంచికముగ ననేక కార్య
లగ్న హృదయుండ బోలె నెల్లరకుఁ గానఁ
బడుదునే కాని, దేవి! నా భావ మెపుడు
నిత్యలగ్నంబు నీ పాద నీరాజనముల!"

"నేటి యాంధ్రులు గుడ్డకుఁ గూటికున్న
చాలుననువారలైనారు; చచ్చిపోయె
నేమొ జాతీయ సత్వమ్ము; కోమలంబు
మల్లికకు నీరు లేకున్న మాడిపోదె!"

"తట్టలో్ గూర్చుండబెట్టిన వధువు నా
గుమ్మడి పూవులోఁ గులికెనొకటి
ఖండితాపాంగ సక్త నవాంబు కణము నా
ఘా సాగ్రమున యందు కదలెనొకటి
తులసిమ్రుగ్గుననిడ్డ తొలుకాడు దివ్వె నా
సాలీని పటముపై సాగెనొకటి
ఘూర్జరీ ముఖలంబి కొసముత్తియంబు నా
నాఁదూడ నొసటిపై నాడెనొకటి......."

(సమాధానాలు మరోసారి)

Thursday, February 6, 2014

పద్య సాహిత్యం--4 (జవాబులు)


ఒకప్పటి కవితలు


"కనుల నొండొరులను..............
...............కావలయు సఖుడ!"

"పరమధర్మార్థమైన.....................
.....................ప్రేమ యందె ముక్తి"

ఇవి "తృణకంకణం" లఘు కావ్యం లోనివి.

"పూర్వ లక్షణములు.......................
.................'అనుక్తంబు ' గ్రథనమందు"

"కుల శుభాంగీ............................
......................రుచులను వలచె నేడు"

ఇవి "రమ్యాలోకం" లోనివి.

"పదినెలలాయె బందెబడి..........................
.......................మధూదయ పర్యుషస్సులన్."

ఇది ద్విపద ఖండికలోనిది.

"ఏదేశమేగినా ఎందుకాలిడినా
ఏపీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీతల్లి భూమిభారతిని
నిలుపరా నీజాతి నిండు గౌరవము!"

కవి రాయప్రోలు సుబ్బారావు. ఈయన తెలుగు భావకవిత్వ యుగానికి ఆద్యుడు.

1892 లో గుంటూరు జిల్లా గార్లపాడులో జన్మించారు. 1909 లో "గోల్డ్ స్మిత్" 'హెర్మిట్' చదివి, దాన్ని అనుసరిస్తూ "లలిత" అనే లఘుకావ్యం వ్రాశారు. 1910 లో టెన్నిసన్ వ్రాసిన "డోరా" ఆధారంగా "అనుమతి" అనే మరో లఘుకావ్యం వ్రాశారు.  1912 లో ప్రచురితమైన "తృణకంకణం" తో యుగకర్త గా గుర్తింపబడ్డారు.

"అమలిన శృంగారం"; "అప్రాప్త మనోహరి" అనగానే గుర్తొచ్చేది వీరే! ఇంకా కష్ట కమల; స్నేహలతాదేవి; స్వప్నకుమారం; ఆంధ్రావళి; జెడకుచ్చులు; రమ్యాలోకం; మధుశాల (ఒమర్ ఖయ్యం రుబాయీలకు అనువాదం) వంటివి వ్రాశారు.

1913 నాటి ఆంధ్రోద్యమ ప్రభావంతో వ్రాయబడిన ద్విపద ఖండిక లోనిదే "యేదేశమేగినా........".

Tuesday, February 4, 2014

పద్య సాహిత్యం--4


ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"కనుల నొండొరులను జూచుకొనుటకన్న
మనసు లన్యోన్య రంజనల్ గొనుటకన్న
కొసరి ఏమోయి యని పిల్చుకొనుటకన్న
చెలుల కిలమీద నేమి కావలయు సఖుడ!"

"పరమధర్మార్థమైన దాంపత్య భక్తి
స్తన్యమోహనమైన వాత్సల్యరక్తి
సాక్షిమాత్ర సుందరమైన సఖ్యసక్తి
పొందు; ఆదిమ మగు ప్రేమ యందె ముక్తి"

"పూర్వ లక్షణములు దిద్దు బుధ్ధిలేదు.
అతి నవీనముల్ శాసించు నహముకాదు
నవ్య కావ్య దృష్టిని చూపినాడనంతె
కలదుగాదె 'అనుక్తంబు' గ్రథనమందు"

"కుల శుభాంగీ వయోధీర కుసుమమందు
మోహమధువె గవేషించె మున్ను సుకవి
సాత్విక ప్రేమ కోశ పేశలము లయిన
వత్స లామృత రుచులను వలచె నేడు"

"పదినెలలాయె బందెబడి
               వాకిలిమూసి, రసాలవాటికన్
మెదలక యున్న కోయిల, స
               మీరుని చక్కలిగింత గుంఫనల్
కదపగ మేలుకాంచి, కల
               కంఠముతో నవనీత గోస్తనీ
మృదుమధురంబుగా కలవ
               రించు మధూదయ పర్యుషస్సులన్."

(సమాధానాలు మరోసారి)