ఒకప్పటి కవితలు.
---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.
"ఏలా వచ్చె హవా హుమాయి పయి, వా
డే కుచ్చు పాగల షో
కేలా, పచ్చ జరీ బుటా మొఖమలం
గీ దాల్చి చైత్రుండు కెం
గేలన్ సోగ గులాబి కొమ్మ కొరడా
కీలించి, సారానెరా
ప్యాలా సారెకు సారెకున్ పెదవులన్
బట్టించుచున్ నవ్వుచున్"
"ఏలా దాచితి విన్నినాళ్లు దయలే
నే లేదటయ్యా భవ
ల్లీలా లోల విలోచనాంచల తటి
ల్లేఖా చలల్లాస్యమే
నాలో కించితినా శిలా జడిమ పా
యంద్రోయనా రంగదే
వా! లావణ్య పయోనిధీ? వివశన్న
త్యం బాడనా కేకినై!"
"ప్రాతదారులందు ప్రథముండు కాలేక
క్రొత్తదారులందు గొప్పరాక
అడ్డుపీతనడక కధికారియయ్యెరా
విశ్వదాభిరామ, వినుర వేమ."
"పలుచ పలుచ పట్టుబట్ట కట్టెను రాజు
మరియు పలుచని బట్ట మంత్రిగట్టె
బట్ట విప్పివేసె బంట్రోతు తోచక
విశ్వదాభిరామ వినుర వేమ."
"...........ఏననంత శోక భీకర తిమిర లోకైకపతిని
నాకు నిశ్వాస తాళవృంతాలు కలవు
నాకు కన్నీటిసరుల దొంతరలు కలవు
నాకమూల్య మపూర్వ మానంద మొసగు
నిరుపమ నితాంత దుఃఖంపు నిధులు కలవు!
ఎవ్వరని యెంతురో నన్ను?"
(సమాధానాలు మరోసారి)
No comments:
Post a Comment