Saturday, December 4, 2010

నువ్వూ......నేనూ

నీకోసం

ఆకాశంలో మేఘాలు ఆనందంగా వర్షిస్తున్నాయి....

మీరేకాదు నేనూ వున్నానంటూ ఉన్మేష ధవళిమలు వెదజల్లుతున్నాడు సూర్యుడు.

తన ప్రియురాలు వానచినుకుని ముద్దాడిన సంతోషంలో....
ఆకాశంలో రంగురంగుల ఇంద్రధనుస్సుని నింపింది కాంతికిరణం.

రోజాలూ, ముద్దబంతులూ ఆ అందాన్ని చూసి మురిసిపోయి ఆనందంతో చిరునవ్వులు చిందిస్తూ,
గాలి తమని వెచ్చగా తాకుతుంటే తలలు వంచుకున్నాయి.

అందమైన ఇంద్రధనుస్సుతో రంగుల ఆకాశం
యెంతందంగా వున్నా, నా కంటికి మాత్రం--
శూన్యంగా కనిపిస్తోంది నా హృదయం లా.

నీకోసం మేమున్నామంటూ నా చుట్టూ
వానచినుకులు చిందులేస్తున్నా, నా మదిలో ఒంటరితనం....!

నేనిలా ఇబ్బంది పడుతుంటే నువ్వు మాత్రం,
మేఘాలు చెప్పే కథలు ఆనందంగా వింటూ వుంటావు.

నీ తలపులు నాతో ఉండీ, నన్ను ఒంటరిని చేస్తోంటే,
నువ్వు మాత్రం హాయిగా ఊహాలోకాలలో విహరిస్తూ ఉంటావు.

రోజాని వేడుకున్న...అనుక్షణం నా నవ్వుని నీకు స్ఫురింప చేయమని!
చందమామని కోరుకున్నా...నా వలపు వెన్నెల నీ చుట్టూ వెదజల్లమని!!
వాన చినుకులని బతిమాలుకున్నా...నా కాలి పట్టాల మువ్వల సవ్వడి నీకు వినిపించమని!!!
చిరుగాలికి చెప్పుకున్నా...నీ ఆచూకీ కనిపెట్టమని!!!!

.......శ్రీ

Saturday, June 26, 2010

నెచ్చెలిని.....

'నీ' చెలిని

వేకువనే నిద్ర లేచి
హేమంత తుషార స్నానం చేసి
లేయెండ చీరకట్టి
బంగారు కిరణాల పసుపు రాసి
ఉదయారుణ కాంతుల పారాణి పూసి
మంచు ముత్యాల కాలి పట్టెడ పెట్టి
మందారమును చిదిమి నొసట తిలకము దిద్ది
పరుగెత్తే చీకట్లు పట్టి, కళ్ళ కాటుక పెట్టి
విరిసిన సుమ మధువు విందారగించి
సంజ కెంజాయనే తాంబూలం సేవించి
తారలను గుచ్చి కంఠహారముదాల్చి
కుముద బాంధవుని కోసి సిగలోన వుంచి
తెలిమబ్బు తేరులో తేలి వచ్చాను!

ఎవరు......ఎవరని యెందుకులికులికి పడతావు--నేనే--నెచ్చెలిని!

కలతనిద్రలో కలలదుమ్ము కంటిలో పడినప్పుడు......

నీ రెప్పల మైదానాలలో విహరించే 'నీ' చెలిని!

Tuesday, March 16, 2010

ఇంకో కవిత

శబ్దం.....రాగం

నా మదిలో రాజుకున్న నిర్లిప్త నీరవ నిశ్శబ్దాన్ని యెవరు చదవగలరు?

చదివి ఆ నిశ్శబ్దం వెనక ఉన్న శబ్దంలో రాగమేదో ఎవరు తెలుసుకోగలరు?

వసంత మోహన కల్యాణి అమృతవర్షిణి -- ఏదీకాదు!

అదో శృతీ లయా లేని అనామికా రాగం.

ప్రేమతో శృతి చేస్తే.....ఆనంద భైరవి....!

నిర్లక్ష్యం తో లయ కలిపితే.......శివరంజని!

.......శ్రీ