Thursday, March 12, 2009

కృత్యాద్యవస్థ-2

మన కవిగారు తన పద్యాన్నే మననం చేసుకొంటూ, అనవేమా రెడ్డి గారి దగ్గరకి బయలుదేరాడు.

దారిలో కొండమీద రెండు ఆవులు మేస్తూ వుండడం చూడగానే, మొదటి పాదం ‘కొండమీద రెండు గోవులు’ అని మారి పోయింది!

ఇంకొంత దూరం పోగానే, ఇంకో కొండ మీదనించి రెండువాగులు క్రిందకి ప్రవహించడం చూడగానే, రెండో పాదం ‘కొండ క్రింద రెండు వాగులు’ అని మారి పోయింది!

ఇంకొంత దూరం ప్రయాణించి, ఓ పొలం లో పని చేసుకొంటున్న అప్పిరెడ్డి ని పలకరించగానే, ఆయన చెవుల పోగులు ఊగాయట! వెంటనే మూడో పాదం ‘అప్పిరెడ్డి చెవుల పోగులు’ గా మారి పోయింది!

గట్టిగా ఈ మూడు పాదాలనీ మననం చేసుకొంటూ రాజుగారి దర్శనానికి వస్తున్న మన కవిగారి అదృష్టం కొద్ది, శ్రీనాధుడు యెదురయ్యాడు!

కధంతా విని, ఆయన నాలుగో పాదం నేను చెప్పింది వేసుకో, అని ‘అనవేమరాజు ఈవులు!’ అని చెప్పాడట.

కవిగారు రాజుగారి దర్శనం చేసుకొని, తన పద్యాన్ని ధైర్యంగా చదివాడట.

“కొండమీద రెండు గోవులు,
కొండక్రింద రెండు వాగులు,
అప్పిరెడ్డి చెవుల పోగులు,
అనవేమరాజు ఈవులు!” అని.

మిగిలిన కవిపండితులు హేళనగా నవ్వుతుంటే సిగ్గుపడిన కవిగారిని శ్రీనాధుడు ఆదుకొన్నాడు—‘ఇందులో చాలా గొప్ప అర్ధం వుంది మహారాజా!

కొండమీదెక్కడో కూడా, మీరు దానమిచ్చిన ఆవులు మేస్తున్నాయి! మీరు దానాలిచ్చేటప్పుడు వదిలిన నీరు, కొండ మీదనించి రెండు వాగులుగా ప్రవహిస్తోందట! ఇక సామాన్య రైతు అప్పిరెడ్డి లాంటివాళ్ళు కూడా, తమ చేత సువర్ణ దానం పొందినవారేనన్నమాట! అందుకే పోగులు వున్నాయట! మరి ఇవన్నీ తమ గొప్ప ఈవులు (దానాలు) కాదా?’

అని శ్రీనాధుడు ముగించగానే,

అందరూ చప్పట్లు, మహారాజుగారిచే కవిగారికి అక్షర లక్షలూ!

Tuesday, March 10, 2009

కృత్యాద్యవస్థ!

అంటే—కృతి మొదలుపెట్టేటప్పుడు కవి పొందే (దాదాపు పురిటి నొప్పుల్లాంటి) అవస్థ (ట)!

ఓ కవిగారు, పాపం చాలా పేదవాడు! వచ్చిన కవిత్వమూ అంతంత మాత్రమే! భార్య సలహాతో, రాజుగారి దగ్గరకి వెళ్ళి కవిత్వం వినిపిస్తే, యెంతో కొంత కిట్టక పోతుందా అని అలో…..చించి, మూడు పద్య పాదాలు తయారు చేసుకున్నాడట!
యేమిటవి?

“అనవేమ మహీపాలా!
రణమునందు కడు శూర్లు,
ఈవులందు శిబి చక్రవర్తులు!”

ఆని!

ఆఖరు పాదం రావడంలేదట యెంత ప్రయత్నించినా!

ఆ పాదం గురించి గుండా పిండి అయిపోతుంటే, భార్య అందిట ‘ఆ మాత్రానికి అంత ప్రయత్నం యెందుకండీ? మీ సంధ్యావందనంలో ఓ ముక్క వేసుకో వచ్చు కదా?’ అని!

వెంటనే మన కవిగారు……..పద్యం పూరించాడు……..వృత్తం మార్చుకొని……ఇలా!

".....శభాషునే భళా ముండా! ధీయోయోనహ్ ప్రత్యోదయాత్!” అని!

బాగుందా? (రాజేమన్నాడో మరోసారి!)

జగద్విఖ్యాతిగాంచిన ‘అన్నమయ్య’ తెలుగు చిత్రానికి పాటలు వ్రాసిన (శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారే అనుకుంటా) కవి కృత్యాద్యవస్థని చూసి నాకు ఈ సన్నివేశమే గుర్తు వచ్చింది!

మరి లేకపోతే……..

‘………….అవతరించెను అన్నమయ,

అసతోమా సద్గమయ!’ (ట)!

ఇంకో చరణం లో……..

తమసోమా జ్యోతిర్గమయ! (ట)!

వీని భావంబేమి తిరుమలేశా!