Friday, March 28, 2014

పద్య సాహిత్యం--8 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు..........

నీవొక యప్సరః ప్రణయినీ..................
...........................సురరాజ్య లక్ష్మికిన్‌.

విరిసినపూల వెన్నెలల వెల్లువఁ ..................
........................హృదంతర బాష్పమాధురిన్‌.

వలచి నిన్ను విసిగించినందులకు ...........
...................................సలుపుకొనుము.

........ఇవి కవి వ్రాసిన "ఓయి సుధాకరా!" అనే ఖండిక లోనివి.

*             *             *

తరతరమ్ముల ప్రేమ.....................
...........నీ యలంకారభరము........

"కోరికల నెల్లమరచి, నాకొరకు నీవు
నీ కొరకు నేను తొలి వేగుబోక రాలు
పూల జత వోలె నీ సుధా పూరమందు 
తేలిపోదము జన్మజన్మాల యాత్ర".

(ఇది ఆయన మార్కు కొట్టొచ్చినట్టు కనిపించే పద్యం. అందుకే ఇక్కడ పూర్తిగా ఇచ్చాను.)

దగ్ధ దినైక చితా......................
.........................క్షతికేల వగపు

అరణి మధించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి.  

ఇవి ఆయన యాత్ర అనే ఖండిక లోనివి.

"నీచపు దాస్య వృత్తి..............
...............సమాధి మృత్తిగన్‌".

ఇది "కాంక్ష" అనే ఖండికలో, పువ్వు కోరికని తెలిపేవి. "మఖన్‌లాల్ చతుర్వేది" హిందీలో వ్రాసిన "ఫూల్ కీ ఇచ్చా" అనే కవితకి స్వేచ్చానువాదం. ఆ హిందీ కవితని నా "సాహితీ కృష్ణ" బ్లాగులో ఇదివరకే వ్రాశాను).

ఇంక కవి పేరు వేదుల సత్యనారాయణ శాస్త్రి. దీపావళి కవిగా సుప్రసిధ్ధులు. 

భద్రాచలం తాలూకా గొల్లగూడెం గ్రామం లో 1900 మార్చ్ 22 న జన్మించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడెమీ సభ్యులు. 1975 లో పరమపదించారు. కృష్ణశాస్త్రి కి చెప్పుకోదగ్గ వారసులు. ఆయన పంథాలోనే, ఇంకా విశిష్టంగా పురోగమించారు. వాళ్లిద్దరి కవితలకీ తేడా స్పష్టంగా తెలియడమే ఈయన విశిష్టత. 

ఈయన దీపావళి; ముక్తఝరి అనే ఖండకావ్యాలూ, అపరాధిని; ధర్మపాలుడు అనే నవలానువాదాలూ, రాణాప్రతాపసింహ; కాలేజ్ గర్ల్ నాటకాలూ వెలువరించారు. ఇంకా "జయము హిమగిరి మణికిరీటా"; "ఏమగునో ఇక నా బ్రతుకు"; "ఈ సముద్ర తటాన"; "ఓ దివ్య గాయకా, ఓ ప్రాణ గాయకా"; "కోసుకొనుము ఈ కోమల కుసుమము"; "ఈ చకోరికకు ఎన్నడూ పున్నమ" లాంటి అనేక ప్రసిద్ధ గీతాలు వ్రాశారు. 

సంస్కృతాంధ్ర ఉభయ భాషా ప్రవీణులే కాకుండా, బెంగాలీ, కన్నడ నేర్చుకున్నారు. ఠాగూర్ బాల సాహిత్యాన్ని తెలుగు చేశారు. భాస మహాకవి నాటకాలు కొన్ని అనువదించారు. అనేక కథలు వ్రాశారు. 

శతాధిక గ్రంథకర్తలైన శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారి శిష్యులు. 

వీరికి "గౌతమీ కోకిల" బిరుదు తెచ్చిపెట్టింది దీపావళి ఖండకావ్య సంపుటి. "ఇంటింట ఆనంద దిపావళీ" అంటూ సాగుతుంది. కుమారుడి అకాల మరణం తో, "మా యింట శోకాంధ తిమిరావళీ" అని ఆక్రోశిస్తారు. అందులోని "ఇల్లు ఖాళీచేసి వెళ్లిపోయాడు" అనే వాక్యం విశ్వసాహిత్యం లో చోటు చేసుకోతగ్గది అని ప్రశంసించబడింది.

"నేనే మిగిలితి నీ గౌతమీనదీ ప
విత్ర గర్భమ్ములో మ్రోత లెట్టుచున్న
యుగ యుగాంతర విశ్వమహోగ్ర దుఃఖ 
జీవగీతాల కావృత్తి చెప్పుకొనగ."

అని చెప్పుకొన్న మహానుభావుడాయన!

Tuesday, March 25, 2014

పద్య సాహిత్యం--8



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

నీవొక యప్సరః ప్రణయినీ
                    కబరీచ్యుత పారిజాత మాలా
విసరంభవో; మఱి యిలా తలమంట 
                    సుధాతుషార వర్షా విమలావ కుంఠనము 
జార్చుచు బోవు శరద్విభావరీదేవి 
                    లలాటికామణివో, దీపికవో, 
సురరాజ్య లక్ష్మికిన్‌.

విరిసినపూల వెన్నెలల వెల్లువఁ 
                    చక్కదనాల హంసవై, యరిగెడు
నిన్నుజూచు నిశలందున నాకగు  బాష్పశాంతి 
                    నీవెరుగుదు; దుఃఖతాపంబుల కిల్లగు 
ప్రాడు ప్రపంచమందెరుగరు కరుణైక
                    ముగ్దుల యగాధ హృదంతర బాష్పమాధురిన్‌.

వలచి నిన్ను విసిగించినందులకు ఫలము
ఆ మరణమేను ప్రేమ గాయకుడనగుదు;
నీవు మాత్రము పూల వెన్నలల రేల
చైత్ర నృత్యోత్సవమ్ముల సలుపుకొనుము.

*             *             *

తరతరమ్ముల ప్రేమ స్వతంత్రులరుగు
దారిఁ బోయెడు నూతనాధ్వగులమనల
పరిహసించెడు పాడు ప్రపంచమునకె
పారవేయుము నీ యలంకారభరము........

"కోరికల నెల్లమరచి, నాకొరకు నీవు
నీ కొరకు నేను తొలి వేగుబోక రాలు
పూల జత వోలె నీ సుధా పూరమందు 
తేలిపోదము జన్మజన్మాల యాత్ర".

"దగ్ధ దినైక చితా భస్మ రాశి
సుప్తివీడెడు ఉసస్సుకు పునాది
ముదిసిశిరమ్మాకు చిదిమినపట్లు
పూలకారు చివుళ్ల పురిటి పొత్తిళ్లు
గతముపై తలపేల,
క్షతికేల వగపు

అరణి మధించి యజ్ఞాగ్ని రగిల్చి
వెలిగించు కాగడా వెలిగించవోయి."  

"నీచపు దాస్య వృత్తి మన 
                    నేరని శూరత మాతృదేశ సే
వా చరణమ్మునందసువు 
                    లర్పణఁ జేసినవారి పార్థివ 
శ్రీ చెలువారు చోట తదసృగ్రుచులన్‌
                    వికసించి వాసనల్ 
వీచుచు రాలిపోవగవలెన్‌ 
                    తదుదాత్త సమాధి మృత్తిగన్‌".

(సమాధానాలు మరోసారి)

Monday, March 10, 2014

పద్య సాహిత్యం--7 (జవాబులు)



ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు...................

"నెమ్మనము తాపమడగించు........................
...............................మీద మలయు టెపుడొ."

"గోడచాటయ్యు చెలినీవు...............................
.....................................వీనుల విందు గాదొ"

"హృదయ పుస్తకమందదికింపబడిన
................................ప్రాణముల్లేచి పోవకుండ"

ఇవి "సౌభద్రుని ప్రణయయాత్ర" అనే కావ్యం లోనివి.

*             *               *

"నీవు మడిగట్టుకొని........................
...........................కన్నీటిబొట్లు రాల్తు."

"ఏను స్నానమ్మునకు..........................
.......................యన్న వాయలలు నన్ను."

ఇవి "మాతృగీతాలు" అనే ఖండకావ్యం లోనివి.

*                *               *

"తురగమ్ము నెక్కి దక్షిణ
.............................దీర్ప వచ్చెదవె కల్క్యాత్మా"

ఇది "అంజలి" ఆనే ఖండిక లోనిది.

*                *                *

"నీవు చలద్ఘనాఘన వినీల...........................................
...............................అన్నగమార్గములమ్మయమ్ముగన్‌"

ఇది "జన్మభూమి" కావ్యం లోని ఖండం "ధరణీధర" లోనిది.

ఇంక వీటి  కవి శ్రీ నాయని సుబ్బారావు.

ఆయన 1899 లో, నెల్లూరు జిల్లా పొదిలె గ్రామం లో జన్మించారు. నరసరావుపేట లో చాలాకాలం అధ్యాపక వృత్తిలో వుండేవారు. 

అప్పటి కవుల్లో కొంతమంది ఊహా ప్రేయసుల గురించి కవితలల్లితే, కొందరు కులపాలికా ప్రణయాన్ని ఆశ్రయించారు. వారిలో విశ్వనాధ వారి తరవాత, నాయని వారు ప్రసిధ్ధులు. 

కులపాలికా ప్రణయం అంటే, పెద్దలు కుదిర్చిన పెళ్లితో భార్యగా వచ్చినావిడ. విశ్వనాధవారు పెళ్లయ్యాక నాయకుడి ప్రణయాన్ని వర్ణిస్తే, నాయని ఓ అడుగు ముందుకేసి వివాహాత్పూర్వ నేపధ్యం కూడా తీసుకున్నారు.

వారి కృతులు--సౌభద్రుని ప్రణయ యాత్ర; వేదనా వాసుదేవము; మాతృగీతాలు; జన్మభూమి అనే కావ్యాలు.

సౌభద్రుని ప్రణయ యాత్ర -- అసుర కృత్యము, శుక్రవారము, ఈప్సిత లేశము, నిద్రా సౌందర్యము, ప్రణయాహ్వానము  వంటి 45 ఖండికల కావ్యం. అభిమన్య-వత్సల (శశిరేఖ) ప్రణయం.

మాతృగీతాలు కావ్యం లో మాతృగీతాలు, సౌందర్య లహరి, తత్త్వమసి, సాగర సంగీతము, ఉత్సారణము, దాస్యగీతి, అంజలి, మహోదయము, పుష్పాంజలి అనే ఖండికలున్నాయి. తల్లి మరణం బిడ్డ మనస్సు మీద చేసే గాయం యెంతటిదో దుఃఖ నిర్భరంగా చిత్రించారిందులో.

అంజలి ఖండికలో పైన వ్రాసిన పద్యం నేతాజీ వ్యక్తిత్వ చిత్రణ. కల్కి అవతారంతో పోలిక.

జన్మభూమి కావ్యం లో ప్రకృతి ఖండం, తటాక ఖండం, ధరణీధర ఖండం, శక్తి ఖండం, శివ ఖండం అనే ఐదు ఆశ్వాసాల్లో, అనేక కథలున్నాయి. ఆయన జన్మ భూమి, బాల్య స్మృతులు, జాలిగాధలూ వినిపించారు. 

భాగ్యనగర కోకిల, విషాద మోహనము అనే రెండు ఖండ కవ్యాలు కూడా వ్రాశారు.

...............మరోసారి మరి కొన్ని.

Thursday, March 6, 2014

పద్య సాహిత్యం--7


ఒకప్పటి కవితలు.

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"నెమ్మనము తాపమడగించు కమ్మతావు 
లలముకొనుటలో తన రాక తెలియుచుండ 
నుత్తరపు గాలి చలిబాధ కోర్చి మించి 
మలయపవనమ్ము నామీద మలయు టెపుడొ."

"గోడచాటయ్యు చెలినీవు పాడు పాట 
వలపు మొలకకు అమృతంపు చెలమ యయ్యె 
తలిరుటాకుల చాటుగ దాగకేమి 
పికకుహూశ్రుతి వీనుల విందు గాదొ" 

హృదయ పుస్తకమందదికింపబడిన 
ప్రేమగీతాలపుట చింపివేయుటెట్లు?
చినుగు వెంబడి పైకెగజిమ్ము రక్త 
మున కలసి ప్రాణముల్లేచి పోవకుండ"

*             *               *

"నీవు మడిగట్టుకొని పోయినావు, పండ్లు,
పుష్పములు తీసికొని దేవపూజకెటకొ
నేను నీ కొంగు పట్టుక నీదు వెంట 
పోవుటకు లేక కన్నీటిబొట్లు రాల్తు."

"ఏను స్నానమ్మునకు బావి కేగునపుడు  
లేత సూర్యుని బంగారు పూతలందు 
మురియుచును తల్లి యొడ్డును ముద్దుగొనుచు
అమ్మ యేదిరా యన్న వాయలలు నన్ను."

*                *               *

"తురగమ్ము నెక్కి దక్షిణ 
కర కమల స్ఫురిత ఖడ్గ కాంతుల దిశలన్‌
మిరు మిట్లు గొలుప, నీ వు 
త్తర కార్యము దీర్ప వచ్చెదవె కల్క్యాత్మా"

*                *                *

"నీవు చలద్ఘనాఘన వినీల మహాపఘనుండవై భవ 
ఛ్ఛ్రీ విపులోరు వక్షమున చిందులు త్రొక్కెడి నేను చంచలన్‌
కావుటదేమి అబ్బురము? క్రమ్ము మయాయిక మత్తటిత్తనూ 
వ్యావృత ధూమలుండవయి అన్నగమార్గములమ్మయమ్ముగన్‌"

(సమాధానాలు మరోసారి)