ఒకప్పటి కవితలు.
---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.
"భావ మొక్కడు గాగ, భావన యొక్కడై
రసభావ పరిణతి యెసగ జేసి,
సరసార్థ మొకడుగా, శబ్దమింకొకడయి,
శబ్దార్థ సామరస్యము ఘటించి,
సూత్రమొక్కడుగాగ, చిత్రణమొక్కడై,
ప్రాణ వత్పాత్రముల్ పాదుకొల్పి,
తెర యెత్తుటొకడుగా, తెర దించుటొక్కడై,
రంగ నిర్వహణమ్ము, రక్తి నిల్పి,
సుందరీనంద జీవితానందమట్లు
పరమమగు కోటికెక్కిన బంధుభావ
మిత్రభావము లిమ్మోయి మేళగించి,
సృష్టిచేసితి మీ కావ్యశిల్పమూర్తి."
* * *
"రండు మాయింటి కీరు పేరంటమునకు
బొమ్మలెత్తును మాపిల్ల, అమ్మలార!
ముద్దచేమంతి పూవులు ముడిచినట్టి
జడలతో, క్రొత్త వల్లెతో, అడుగులబడి
చిందులం ద్రొక్కు పరికిణీ చెలువు తోడ,
కాళ్ళ పారాణి, కాటుక కన్నుగవను
దిద్దికొని, మురి పెమ్మును ముద్దులొలక
నగు మొగమ్ముల తోడ కన్యకలు, నీకు
అర్రలొసగగ, నిలిచి రీ వరుగునపుడు
వచ్చిపోవమ్మ, మా యింటి పజ్జ కీవు!
పరమ కల్యాణి! మా తల్లి! పౌష్యలక్ష్మి!"
* * *
"కంకి వెడలిన ఆ లేతకారు జొన్న
చేనిపై, పిట్టలందోలు చిన్నవాడ!
దారిబోయెడు వారల పారజూచి,
విసరుమా, సుంత, వడిసెల! వెనుకనదిగొ
కంకి తినుచున్నయది గోరువంక, ఇంత
యాల సించిన నిలుచునో చాలదూర
మెగిరి పోయిన దప్పుడే! దిగకు మంచె!......"
* * *
ఎఱ్ఱ సెరలనందుని చూపులు, ఇంతి
ఆననేందునకు కెంపుల నివాళులెత్త,
అతివకజ్జలపుచూడ్కి, ప్రియుని
వక్షః కవాటి, కట్టుతోరణములు నల్లకల్వపూల!
* * *
ప్రాణమా! యంచు నొండొరు పల్కరింప
సాగి, 'ప్రా' మాత్ర పర్యవసన్నములగు
ఎలుగులు గళమ్ముతగుల, దామెట్టకేని
యనిరి 'గఛ్ఛామి బుధ్ధం శరణ' మటంచు.
(సమాధానాలు మరోసారి)
No comments:
Post a Comment