Thursday, January 23, 2014

పద్య సాహిత్యం--3 (జవాబులు)


ఒకప్పటి కవితలు

"విరిదండ..............
..............మరపులు దోచె."

ఇవి 1922 లో ప్రచురణ పొందిన "ఏకాంతసేవ" అనే కావ్యం లోనివి.

"చెట్టునకు మొగ్గ..............
...........................ప్రేమకొరకు."

ఖండకృతుల లోనివి.

"నీ నీడలోనుంటి.....................
................................నేనను కొందునె ప్రభు?"

ఇది 1943 లో వెలువడిన "భావ సంకీర్తనలు" లోనిది.

"కుమ్మరిసారె.................
.................నెచ్చెలులెంత పిల్చినన్."

ఇది "బృందావనం" అనే లఘుకావ్యం నుంచి, బృంద బొమ్మల పెళ్ళిళ్ళు ఎందుకు ఆడడంలేదో చెబుతుంది.

ఇంక, "వెంకట పార్వతీశ్వర కవులు" గా ప్రసిధ్ధి చెందినవారిలో బాలాంత్రపు వెంకటరావుగారు 1880 లో జన్మించారు. రెండోవారు ఓలేటి పార్వతీశం గారు 1882 లో జన్మించారు. ఇవి వారి రచనల్లోవి.

వీరు అనేక నవలలు, కావ్యాలూ వ్రాశారు. తెలుగునాట నవలలకి గొప్ప గిరాకీ ఏర్పరిచింది వీరేనట. నవలలు చాలా భాగం బెంగాలీ అనువాదాలు. స్వతంత్ర రచనల్లో, 1910 లో ప్రచురించబడిన "మాతృమందిరం", "దుర్గేశనందిని", "ప్రమదావనం", "వసుమతీవసంతం" కాక ఇంకా చాలా వున్నాయి. 

కావ్యాలు "ఏకాంతసేవ", "భావ సంకీర్తనలు", "బృందావనం", "కావ్య కుసుమావళి" మొదలైనవి. ఏకాంతసేవ ని "వంగభాషకు గీతాంజలి ఎలాంటిదో తెలుగుభాషకిది అలాంటిదని నా అభిప్రాయం" అన్నారు దేవులపల్లి కృష్ణశాస్త్రి.

నవ్యకవులమీద వీరి ప్రభావం వుంది.

(ఈ వ్యాసాలు నేను, పద్య సాహిత్యం మీది అభిమానం కొద్దీ, సేకరించి వ్రాస్తున్నవే. అసలు వీటిని వ్రాసిన రచయితల వివరాలు కూడా వ్రాస్తాను. అంతవరకూ వారికి నా క్షమాపణలు.)

Tuesday, January 21, 2014

పద్య సాహిత్యం--3



ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"విరిదండ మెడలోన వేయుటే కాని
కన్నార నీ మూర్తి గాంచనేలేదు.
ప్రణమిల్లి అడుగుల బడుటయే గాని
చేతు లారగ సేవ చేయనేలేదు."

"వెలుగు చీకటి విరిసె కాబోలు
మనసులో తెలివిలో మరపులు దోచె."

"చెట్టునకు మొగ్గతొడిగెడు చేష్టకలదు
కోరకమునకు వికసించు గుణముకలదు
విరికి వలపులు వెదజల్లు విద్యగలదు
దేనికొరకిది యంతయు దేనికొరకు?
ప్రేమకొరకు, ప్రేమకొరకు, ప్రేమకొరకు."

        ....       ....       ....      ....    

"ఈ సుఖంబును కష్టంబునెందుకొరకు
ఈ భవంబును నాశంబు నెందుకొరకు
ఈ జగంబున నిన్నియు నెందుకొరకు
ప్రేమకొరకు, ప్రేమకొరకు, ప్రేమకొరకు."

"నీ నీడలోనుంటి; నీడ నేనను కొంటి
నీడనే గాదన నేరకుంటి.
నీడజూచిన వాడ; నిను జూడకుంటిని
నీడలో నడకలు నేర్చుకొంటి.
నీడయాకృతి జూచి; నిజమనుకొంటిని
నీ నిజంబు గ్రహింప నేరనైతి.
నీడతో మాటాడి, నీ మాట మరచితి
నీడ మాటయు విననేరనైతి.
నేను నీ నీడనౌదునో కానొ, ఎరుంగ గాని
ఈ నీడ వాడను గానటంచు
నీడ నాది గాదనుచును నిశ్చయించుకొంటి
నీవాడ నేనను కొందునె ప్రభు?"

"కుమ్మరిసారె లచ్చనలు
             కుందెన కాళులు త్రొక్కుబిళ్ళలున్,
చిమ్మనగ్రోవు లోలలును
            చీకురు బండలు నాడుగాని, యే
యమ్మకు అల్లుడౌనొ తన
            యాసల కృష్ణుడటంచు బృంద, తా
బొమ్మల పెండ్లి యాటలకు
            పోవదు నెచ్చెలులెంత పిల్చినన్."

(సమాధానాలు మరోసారి)

Tuesday, January 14, 2014

పద్య సాహిత్యం



ఒకప్పటి కవితలు

మొన్నటి నా "ఒకప్పటి కవితలు" టపా కి సమాధానాలేమీ రాలేదు--బహుశా యెవరూ వూహించి వుండరేమో!

"ఉరు మహీధర................
...........వాహినిగఁ దోచె"

ఇది "మాతృగీతి" అనే ఖండిక లోది.

"నేను దుఃఖింతు..................
.......................డిండీర రుచుల"

ఇది "సముద్ర ఘోషము" లోనిది.

"సాయం ప్రస్ఫుట..........................
...............సర్తింపుమా శంకరా"

ఇది "ప్రళయ నర్తనం" ఖండిక లోది.

"అవిధరాగర్భమున......................
.......................నా అస్థిపంజరమ్ము!"

ఇది "సుప్తాస్థికలు" ఖండిక లోనిది.

ఇంక, ప్రపంచ ప్రసిధ్ధుడైన ఈ గొప్ప కవి--మహాకవి "శ్రీ శ్రీ" అనబడే "శ్రీరంగం శ్రీనివాస రావు".

ఆయన "ఇలాంటివి కూడా" వ్రాశాడా అంటారేమో......ఇలాంటివే ఇంకా చాలా వ్రాశాడు.

Sunday, January 12, 2014

ఒకప్పటి కవితలు

---ఈ క్రింది కవితలు యెవరివో తెలిస్తే చెప్పండి. లేదా వూహించడానికి ప్రయత్నించండి.

"ఉరు మహీధర సాను నిర్ఘర నికాయ
నిర్మలాంబు ప్రవాహ నిర్ణిద్ర వృత్తి
విలసనమ్ముల, ప్రకృతిదేవి, ప్రహృష్ట
హృత్ ప్రపూర్ణానురాగ వాహినిగఁ దోచె"

"నేను దుఃఖింతు మానవాజ్ఞానమునకు
నేను హర్షింతు మానవ జ్ఞానమునకు
అఖిల మనుజ దుఃఖ ప్రమోదాశ్రుసలిల
ధారభరియింతు క్షార డిండీర రుచుల"

"సాయం ప్రస్ఫుట రాగరంజిత లసత్
                          సంపూర్ణ సౌందర్య రా
శీ యుక్తామల దివ్యమూర్తివై సా
                         క్షీ భూతనానా మరు
త్తోయస్త్రోత్ర గభీరగాన రస సం
                         తుష్టాంతరంగంబునన్
మాయా మేయ జగద్వినాశన
                         మతిన్ నర్తింపుఆ శంకరా"

"అవిధరాగర్భమున మానవాస్థికా, ప
రంపరలు--సుప్తనిశ్శబ్ద సంపుటములు
అటనొకే దీర్ఘ యామిని ఆనిశా శ్మ
శాన శయ్యకు ప్రతహ్ ప్రసక్తి లేదు--
నా కనుంగవ కన్నీళులై కరంగు
నని యొనర్చెడు నీరవాహ్వాన మెరిగి
ఇంత శోషిల్లు నేలొ, నా హృదయపుటము
వణుకు నేటికి నా అస్థిపంజరమ్ము!"

క్లూ : ఈయన ప్రపంచ ప్రసిధ్ధుడైన ఓ గొప్ప కవి.

(సమాధానాలు మరోసారి)