'నీ' చెలిని
వేకువనే నిద్ర లేచి
హేమంత తుషార స్నానం చేసి
లేయెండ చీరకట్టి
బంగారు కిరణాల పసుపు రాసి
ఉదయారుణ కాంతుల పారాణి పూసి
మంచు ముత్యాల కాలి పట్టెడ పెట్టి
మందారమును చిదిమి నొసట తిలకము దిద్ది
పరుగెత్తే చీకట్లు పట్టి, కళ్ళ కాటుక పెట్టి
విరిసిన సుమ మధువు విందారగించి
సంజ కెంజాయనే తాంబూలం సేవించి
తారలను గుచ్చి కంఠహారముదాల్చి
కుముద బాంధవుని కోసి సిగలోన వుంచి
తెలిమబ్బు తేరులో తేలి వచ్చాను!
ఎవరు......ఎవరని యెందుకులికులికి పడతావు--నేనే--నెచ్చెలిని!
కలతనిద్రలో కలలదుమ్ము కంటిలో పడినప్పుడు......
నీ రెప్పల మైదానాలలో విహరించే 'నీ' చెలిని!