ప్రపంచపు ‘రంగు’
తనదైన ప్రపంచం లోనించి అప్పుడే బయటికి తొంగి చూసే
ఆ పసి హృదయాన్ని ఇంకా చేరలేదు.......
ప్రపంచమంతటా కమ్మిన స్వార్థపు నీడలు
కమ్మని కలల అమ్మ వడిలో నిదురించే ఆ చిన్నారి కనులు
ఇంకా చూడలేదు మనుషులలో అమానుషత్వాన్ని.
ఆనందంగా కేరింతలు కొట్టే ఆ పసి మనసుకు
ఇంకా అంటలేదు ప్రపంచపు మాలిన్యం.
ఉంగ ఉంగ అంటూ ఊసులాడే ఆ బోసినవ్వుల చిన్నారికి
ఇంకా తెలియదు యే మాటల గారడి.
బుడి బుడి నడకలు నడిచే ఆ బుజ్జాయికి తెలియదు
రోజా ఎరుపుకీ, రుధిర వర్ణానికి వ్యత్యాసం.
చిరునవ్వులు చిందిస్తూ కనువిందుచేసే ఆ శిశువుకి యెలా తెలుస్తుంది?
“తను చూసే రంగుల ప్రపంచానికీ, ప్రపంచపు ‘రంగు’ కీ మధ్య తేడా యేమిటో!”
…………..శ్రీ