Tuesday, March 16, 2010

ఇంకో కవిత

శబ్దం.....రాగం

నా మదిలో రాజుకున్న నిర్లిప్త నీరవ నిశ్శబ్దాన్ని యెవరు చదవగలరు?

చదివి ఆ నిశ్శబ్దం వెనక ఉన్న శబ్దంలో రాగమేదో ఎవరు తెలుసుకోగలరు?

వసంత మోహన కల్యాణి అమృతవర్షిణి -- ఏదీకాదు!

అదో శృతీ లయా లేని అనామికా రాగం.

ప్రేమతో శృతి చేస్తే.....ఆనంద భైరవి....!

నిర్లక్ష్యం తో లయ కలిపితే.......శివరంజని!

.......శ్రీ

Saturday, December 5, 2009

అంతరంగం


స్వీయ నింద

ఎవరెస్టుకన్నా ఎత్తైన నా ఊహాలోకపు ద్వారాలు 

ఎవ్వరూ చేరలేరు.

శిరీషపుష్పం కన్నా సున్నితమైన నా హృదయాన్ని 
ఎవ్వరూ చదవలేరు.

నేనో శిలని………… 
నువ్వు నాకోసం తపిస్తే—నీ ఆత్మఘోషని నిశ్చలం గా వింటాను!

నేనో అలని………… 
అందినట్టే అంది ఆశలలో నిన్ను ముంచి వెనక్కి చల్లగా జారుకుంటాను!

నేనో సంకెలని…… 
నా ఙ్ఞాపకాలతో నీ మనస్సుని బంధిస్తాను!

నాలో ప్రేమ వుంది—కానీ అది నా పెదవి దాటదు. 
నాలో భావం వుంది—కానీ అది అనుభవం గా మారదు. 
నాలో అలజడి వుంది—కానీ అది శబ్దం చేయదు. 
నాలో మనసు ఉంది—కానీ అది ఊగిసలాడదు; ఉబలాట పడదు. 
నాలో మమత వుంది—కానీ అది కనిపించదు; వినిపించదు.  


అందుకే, ‘నువ్వు నన్ను అర్థం చేసుకోవు ‘ అని 
నీమీద నెపం వేసే కన్నా— 
‘నేను నీకు అర్థం కాను ‘ అని 
నన్ను నేను నిందించుకోవడం నయం!  


--శ్రీ



Saturday, November 14, 2009

 
ఒంటరితనం  


నిన్ననే విచ్చుకున్న జీవితపు చెంగల్వ 
మెల్లగా ముడుచుకుంటోంది.  


జీవితపు గులాబీనుండి 
ఒక్కోరోజూ ఒక్కోరేకూ నేలరాలిపోతోంది.  


మనసు పళ్ళెం లో నింపిన అనురాగపు మధువు 
బొట్లు బొట్లుగా జారిపోతోంది.  


.......ఏ అనుభూతినీ మిగల్చకుండానే.....!  


హృదయాన్ని ముక్కలుచేస్తూ కాలం 
కళ్ళెం లేకుండా గుర్రం లా పరుగు తీస్తోంది.  


ఏ శీతాకాలపు ఉష్స్సులోనో, 
ఏ వసంతకాలపు సాయంత్రం లోనో, 
ఒక్క క్షణం--ఒకే ఒక్క క్షణం.... 
మలయ సమీరం లా నా యెదలోకి చొచ్చుకుపోయిన నువ్వు.... 
ఒకే ఒక్క అనురాగ బిందువుని రుచి చూసి, 
హడావిడిగా మూతి తుడుచుకుంటూ వెళ్ళిపోతావు!  


వెర్రిగాలి వెక్కిరిస్తూంటే, శిలలా నిలబడిపోయిన నాకు 
యేం మిగిలింది మళ్ళీ -- ఒంటరితనం తప్ప!  


.............శ్రీ





Sunday, September 20, 2009

కవిత



తగిన చోటు  


మకరంద మందార మాలలు,  


విరజాజుల విరిదండలు,  


పరిమళ పారిజాతాలు,  


సువర్ణ సంపెంగ గుచ్చాలు,

చిన్నారిచిట్టి చేమంతులు,

అరవిరిసిన అరవిందాలు

ప్రేమగా నీ కంఠాన్ని కౌగలించుకొంటుంటే.......

చోటేది ప్రభూ! నా చేతిలోని గరికెపూవుకు?

నీ పాదాలవద్ద తప్ప!!!


Saturday, August 22, 2009

పరిభాష
ఇది విన్నావా……..?

నీ కనులు, నా కనులు సమ్మోహనం గా చెప్పుకునే కబుర్లు—“బాసల”ట.

నీకు బాధ కలిగితే నా మనసు యేడవడం,
నీకంట నీరు చిందితే నా గుండెకు బాధ కలగడం—“ఆత్మీయత”ట.

నువ్వులేని క్షణమొక యుగంగా గడవడం,
నిన్ను చూడగానే యెద అలలా యెగియడం—“ప్రేమ”ట.

ఇన్ని మధురమైన భావాలను పదిలంగా
దాచుకునే గుప్పెడంత చోటు—“హృదయమ”ట.

ఈ పరిభాష నువ్వెప్పుడైనా విన్నావా!?!

……….శ్రీ

Thursday, July 30, 2009

నా బాధ....

బాధోపశమనం
నా మానస అంబరాన వెలిగే ఓ జాబిల్లీ…….
వలపుల వెన్నలచల్లి యెదమంటలు ఆర్పవోయి!

నా మానసలోగిలిలో విరిసిన ఓ మరుమల్లీ…….
మమతా సౌరభాలుచల్లి గుండెరొదను మాన్ పవోయి!

గుప్పెడంత గుండెలోన సంద్రమంత ప్రేమ…..
సంద్రమంత ప్రేమలోన……ఉప్పెనంత బాధ!

ఉప్పెనంత బాధలో యెన్నెన్ని కథలో……
ఉసురుమనే గుండెలో యెంతెంత దిగులో!

నిశ్చల నిశి అంచులలో మెరిసే ఓ ధృవతార……
కంటినీరు వినిపించే కథలన్నీ వినవోయి!

నిశ్శబ్దంగా వీచే చల్లని ఓ చిరుగాలీ……
మదిని గూడుకట్టుకున్న వెతలను తెరిమెయ్యవోయి!

......శ్రీ!


Saturday, June 20, 2009

నేను……

....నా అంతరంగం
యెందరో బాటసారుల ఆశాంచల వీధులలో
ఉషస్సునై మల్లికలా వికసించాను….

ఇంకెందరో బాటసారుల కనులలో
రంగురంగుల కలల పులుగులకి
ఆశల పట్టుదారం తో ఊహల గూళ్ళు నిర్మించాను!

నా అంతరంగం తెలియని వారందరూ

నేను పొగరున్న శిలనన్నారు!
జగమొండి మరబొమ్మనన్నారు!
నిజం కాని కలనన్నారు!
కలవరపరిచే కలకంఠినన్నారు!

నేను……

శిలను కాను; కలను కానేకాను!
మరబొమ్మనీ కాను; మానూ మాకునీకాను!

అనుభూతి లతాగ్రాలలో పూసిన ప్రేమ పుష్పాన్ని…

అర్థం చేసుకున్నవారికి అపురూపమైన ఆనందాన్ని!

అర్థం చేసుకోలేనివారికి అందని వరాన్ని!


----శ్రీ