Tuesday, April 21, 2009

ప్రపంచపు ‘రంగు’



ప్రపంచపు ‘రంగు’

తనదైన ప్రపంచం లోనించి అప్పుడే బయటికి తొంగి చూసే
ఆ పసి హృదయాన్ని ఇంకా చేరలేదు.......
ప్రపంచమంతటా కమ్మిన స్వార్థపు నీడలు

కమ్మని కలల అమ్మ వడిలో నిదురించే ఆ చిన్నారి కనులు
ఇంకా చూడలేదు మనుషులలో అమానుషత్వాన్ని.

ఆనందంగా కేరింతలు కొట్టే ఆ పసి మనసుకు
ఇంకా అంటలేదు ప్రపంచపు మాలిన్యం.

ఉంగ ఉంగ అంటూ ఊసులాడే ఆ బోసినవ్వుల చిన్నారికి
ఇంకా తెలియదు యే మాటల గారడి.

బుడి బుడి నడకలు నడిచే ఆ బుజ్జాయికి తెలియదు
రోజా ఎరుపుకీ, రుధిర వర్ణానికి వ్యత్యాసం.

చిరునవ్వులు చిందిస్తూ కనువిందుచేసే ఆ శిశువుకి యెలా తెలుస్తుంది?
“తను చూసే రంగుల ప్రపంచానికీ, ప్రపంచపు ‘రంగు’ కీ మధ్య తేడా యేమిటో!”

…………..శ్రీ

Thursday, March 12, 2009

కృత్యాద్యవస్థ-2

మన కవిగారు తన పద్యాన్నే మననం చేసుకొంటూ, అనవేమా రెడ్డి గారి దగ్గరకి బయలుదేరాడు.

దారిలో కొండమీద రెండు ఆవులు మేస్తూ వుండడం చూడగానే, మొదటి పాదం ‘కొండమీద రెండు గోవులు’ అని మారి పోయింది!

ఇంకొంత దూరం పోగానే, ఇంకో కొండ మీదనించి రెండువాగులు క్రిందకి ప్రవహించడం చూడగానే, రెండో పాదం ‘కొండ క్రింద రెండు వాగులు’ అని మారి పోయింది!

ఇంకొంత దూరం ప్రయాణించి, ఓ పొలం లో పని చేసుకొంటున్న అప్పిరెడ్డి ని పలకరించగానే, ఆయన చెవుల పోగులు ఊగాయట! వెంటనే మూడో పాదం ‘అప్పిరెడ్డి చెవుల పోగులు’ గా మారి పోయింది!

గట్టిగా ఈ మూడు పాదాలనీ మననం చేసుకొంటూ రాజుగారి దర్శనానికి వస్తున్న మన కవిగారి అదృష్టం కొద్ది, శ్రీనాధుడు యెదురయ్యాడు!

కధంతా విని, ఆయన నాలుగో పాదం నేను చెప్పింది వేసుకో, అని ‘అనవేమరాజు ఈవులు!’ అని చెప్పాడట.

కవిగారు రాజుగారి దర్శనం చేసుకొని, తన పద్యాన్ని ధైర్యంగా చదివాడట.

“కొండమీద రెండు గోవులు,
కొండక్రింద రెండు వాగులు,
అప్పిరెడ్డి చెవుల పోగులు,
అనవేమరాజు ఈవులు!” అని.

మిగిలిన కవిపండితులు హేళనగా నవ్వుతుంటే సిగ్గుపడిన కవిగారిని శ్రీనాధుడు ఆదుకొన్నాడు—‘ఇందులో చాలా గొప్ప అర్ధం వుంది మహారాజా!

కొండమీదెక్కడో కూడా, మీరు దానమిచ్చిన ఆవులు మేస్తున్నాయి! మీరు దానాలిచ్చేటప్పుడు వదిలిన నీరు, కొండ మీదనించి రెండు వాగులుగా ప్రవహిస్తోందట! ఇక సామాన్య రైతు అప్పిరెడ్డి లాంటివాళ్ళు కూడా, తమ చేత సువర్ణ దానం పొందినవారేనన్నమాట! అందుకే పోగులు వున్నాయట! మరి ఇవన్నీ తమ గొప్ప ఈవులు (దానాలు) కాదా?’

అని శ్రీనాధుడు ముగించగానే,

అందరూ చప్పట్లు, మహారాజుగారిచే కవిగారికి అక్షర లక్షలూ!

Tuesday, March 10, 2009

కృత్యాద్యవస్థ!

అంటే—కృతి మొదలుపెట్టేటప్పుడు కవి పొందే (దాదాపు పురిటి నొప్పుల్లాంటి) అవస్థ (ట)!

ఓ కవిగారు, పాపం చాలా పేదవాడు! వచ్చిన కవిత్వమూ అంతంత మాత్రమే! భార్య సలహాతో, రాజుగారి దగ్గరకి వెళ్ళి కవిత్వం వినిపిస్తే, యెంతో కొంత కిట్టక పోతుందా అని అలో…..చించి, మూడు పద్య పాదాలు తయారు చేసుకున్నాడట!
యేమిటవి?

“అనవేమ మహీపాలా!
రణమునందు కడు శూర్లు,
ఈవులందు శిబి చక్రవర్తులు!”

ఆని!

ఆఖరు పాదం రావడంలేదట యెంత ప్రయత్నించినా!

ఆ పాదం గురించి గుండా పిండి అయిపోతుంటే, భార్య అందిట ‘ఆ మాత్రానికి అంత ప్రయత్నం యెందుకండీ? మీ సంధ్యావందనంలో ఓ ముక్క వేసుకో వచ్చు కదా?’ అని!

వెంటనే మన కవిగారు……..పద్యం పూరించాడు……..వృత్తం మార్చుకొని……ఇలా!

".....శభాషునే భళా ముండా! ధీయోయోనహ్ ప్రత్యోదయాత్!” అని!

బాగుందా? (రాజేమన్నాడో మరోసారి!)

జగద్విఖ్యాతిగాంచిన ‘అన్నమయ్య’ తెలుగు చిత్రానికి పాటలు వ్రాసిన (శ్రీ వేటూరి సుందర రామ మూర్తి గారే అనుకుంటా) కవి కృత్యాద్యవస్థని చూసి నాకు ఈ సన్నివేశమే గుర్తు వచ్చింది!

మరి లేకపోతే……..

‘………….అవతరించెను అన్నమయ,

అసతోమా సద్గమయ!’ (ట)!

ఇంకో చరణం లో……..

తమసోమా జ్యోతిర్గమయ! (ట)!

వీని భావంబేమి తిరుమలేశా!

Sunday, November 9, 2008

రా……….నేస్తం!

నీకూ నాకూ మధ్య……...

అక్షరాల ఇటుకలతో వంతెన నిర్మించాను.
అనురాగపు మెట్లతో నిచ్చెన వేశాను.

ఉషస్సులో, తమస్సులో…..
ఊహల పల్లకీలో ప్రయాణిస్తూ…..
నిన్నెలా చేరుకోను?

అందుకే—భావాల బంధాలకు బంగారు రంగు పులిమి
అరుణ కిరణాలతో సందేశం పంపాను.
అందిందా నేస్తం అది నీకు?

మరి ఇంకా ఆలస్యం యెందుకు?

మెఱుపుకంటే ముందుగా,
చిరుగాలి తరగలా పయనిస్తూ,
సెలయేటి అలలా పులకిస్తూ,
విరజాజి విరిలా పల్లవిస్తూ…..
నన్ను చేరుకో నేస్తం!

రా! రా……….నేస్తం ……….నాకోసం!


……..శ్రీ

(ఆంధ్ర భూమిలో, “కోయిలా! కో…యిలా!”శీర్షిక క్రింద ప్రచురింపబడింది)

Friday, October 31, 2008

హైకూలు

ఈ మధ్య చాలామంది పత్రికల్లో హైకూల పేరుతో తమ కవితల్ని ప్రచురిస్తున్నారు.

కాని, అసలు హైకూలు అనేవి జపనీస్ భాషలో కవితలు.

వాటి స్వారస్యం ఎక్కడంటే, ఇవి 3 పాదాల్లొ వుంటాయి.

కాని.....

ఆఖరు పాదం తీసేస్తే, మొదటి రెండు పాదాలకీ అసలు సంబంధం వుండదు!

నా ఉదాహారణ హైకూలు:-

1) 'అనంతాకాశం!

కల్లోల కడలి!

నడుమ----నిండు జాబిల్లి!'

2) 'ఆకాశం క్రింద మబ్బులు!

అనంతానంద హేల!

మయూరి నాట్య లీల!'

-------ఇలాంటివి. ట్రై చెయ్యండి!

Monday, October 20, 2008

మిగిలిపో!

నా అంతరంగాన్ని నీ మనో నేత్రంతో చూడు!
ఏ చిత్రకారుడి ఊహకీ అందని
అపురూప సౌందర్యాలు కనిపిస్తాయి.

నా ఎదసొదలని ఒక్కసారి విను!
ఏ గాయకుడి గళానికీ అందని
అనూహ్య రాగాలు వినిపిస్తాయి.

నా మనసు పుస్తకాన్ని ఒక్కసారి చదువు!
ఏ కవి కలానికీ అందని
అవ్యక్త భావాలు తెలుస్తాయి.

నువ్వు.....

చిత్రకారుడివై ఏ సౌందర్యాన్నీ చిత్రించక్కర్లేదు......
గాయకుడివై ఏ రాగాన్నీ గానం చెయ్యక్కర్లేదు ......
కవివై ఏ భావాన్నీ వర్ణించక్కర్లేదు......

నన్ను నన్నుగా ప్రేమించే
ఒక మంచి స్నేహితుడిగా.....మిగిలిపో! చాలు.

......శ్రీ
.........చాలు!


విశ్వమంత చోటేల?

నీ మదిలో.....గుప్పెడంత స్థలం చాలు!

సూర్యుడంత కాంతులేల?

నీ కనులలో.....మెరిసే గోరంత మెఱుపులే చాలు!

వెన్నెలంత చల్లదనమేల?

నీ చిరునవ్వుల .....తియ్యందనాలు చాలు!

మల్లెలంత పరిమళాలేల?

నీ మాటల.....సౌరభాల గుబాళింపులే చాలు!

సముద్రమంత అమృతమేల?

నీకు నాపై.....ఉన్న ప్రేమ చాలు!


.....శ్రీ